'పంచగ్రామాల' పరిష్కారం
సింహాచలం పంచగ్రామాల భూముల సమస్య పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కార్యాచరణకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రి గంటా విడుదల చేశారు.
విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా మరో అడుగు పడింది. ఈ మేరకు ఉత్తర్వుల క్రమబద్దీకరణ, విధివిధానాలను మంత్రి గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆవిష్కరించారు. పంచ గ్రామాల సమస్యల పరిష్కార చట్టంపై గవర్నర్ మంగళవారం ఆమోదం తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలతో 5 నియోజకవర్గాల పరిధిలోని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రమబద్ధీకరించిన ఉత్తర్వులకు సంబంధించి 2 రోజుల్లో పత్రిక ప్రకటన వస్తుందని, అభ్యంతరాలు ఉంటే తెలిపే అవకాశముందని మంత్రి గంటా తెలిపారు. 200 గజాల వరకు ఉన్నవారు నిర్మాణం చేపట్టి ఉంటే, ఉచితంగా క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. 201 నుండి 500 వరకు గజాల్లో నిర్మాణం చేపట్టిన వారు, 1998 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 శాతం రేటును చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని చెప్పారు. సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యను రాజకీయం చేయాలనుకునే వారికి నిరాశే మిగిలిందని గంటా అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 62 వేల మందికి ఇళ్ల పట్టాలు అందజేశామని తెలిపారు. గాజువాక హౌస్ కమిటీ సమస్యను పరిష్కరించామని గుర్తుచేశారు.