ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కర్రసాము, కత్తిసాము క్రీడలు వారసత్వంగా వస్తున్నాయి. వీటిని సాధన చేసి.. ప్రత్యేక గుర్తింపు పొందుతున్నవారు కూడా ఉన్నారు. ఆసక్తి, ఉత్సాహం, సాధనే పెట్టుబడిగా వయసు, లింగబేధం లేకుండా ఈ విద్య నేర్చుకుంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కర్రసాము, కత్తిసాము సాధన చేస్తున్నారు.
శిలంబం క్రీడల్లో దాదాపు ఎనిమిది నుంచి పది రకాల విన్యాసాలు సాధన చేస్తున్నారు. ఈ క్రీడలో ప్రావీణ్యం ఉండి.. పోటీల్లో గెలిచిన పతకాల ఆధారంగా తమిళనాడులో క్రీడా కోటాలో రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ క్రీడా రిజర్వేషన్లు ఇవ్వాలని.. తద్వారా మరింత మంది కర్రసాము, కత్తిసాము పట్ల ఆసక్తి చూపుతారని.. శిలంబం అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రీడ ద్వారా మహిళలు, యువతులు ఆత్మరక్షణ పద్ధతులు నేర్చుకుంటారని.. అది వారికి భరోసా కల్పిస్తుందన్నారు.