విశాఖ నడిబొడ్డున కారుచౌకగా భూమి బేరం.. విస్తుగొలిపే డెవలప్‌మెంట్ ఒప్పందం DASAPALLA LANDS : విశాఖలోని దసపల్లా భూములు కారుచౌకగా కొట్టేసేందుకు అధికార పార్టీ పెద్దలు నెరిపిన వ్యవహారం విస్తుగొలుపుతోంది. భూ యజమానులు పప్పు బెల్లాలు పంచిపెడుతూ.. డెవలపర్ తన ఖాతాలో కోట్లు వేసుకునేలా చేసుకున్న ఒప్పందం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. చదరపు గజం లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఆ భూముల్లో చేపట్టే ప్రాజెక్టులో డెవలపర్ 70 శాతానికి పైగా తీసుకుంటూ, భూయజమానులకు మాత్రం 30 శాతం కన్నా తక్కువ చెల్లించేలా ఒప్పందం కుదిరింది.
విశాఖ నడిబొడ్డున ఉన్న ఖరీదైన దసపల్లా భూములు తమవని చెబుతూ ఏళ్లుగా పోరాడుతున్న 64 మంది నుంచి 15 ఎకరాల భూములను మంచినీళ్లు తాగినంత సులభంగా లాగేసుకున్నారంటే.. దీని వెనక ఎంత మంత్రం నడిచి ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఐదేళ్ల క్రితం వైకాపా నేతగా ఈ భూములపై విచారణ జరపాలంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారమే వాటి విలువ 15 వందల కోట్లు. అంత విలువైన భూముల్ని కారుచౌకగా తీసుకుంటున్న ఆ డెవలపర్ వెనుక.. ఎంత బడాబాబులు, పలుకుబడిగలవాళ్లు ఉండుంటారోనని ప్రజలు సందేహిస్తున్నారు.
ఒప్పందం చేసుకున్న ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ : దసపల్లా భూముల్లో విలాసవంతమైన నివాస, వాణిజ్య టవర్ల నిర్మాణానికి ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ అనే సంస్థ.. భూ యజమానులుగా చెలామణి అవుతున్న వారితో డెవలప్‌మెంట్ ఒప్పందం చేసుకుంది. సాధారణంగా ఏదైనా స్థలాన్ని డెవలప్‌మెంట్‌కు ఇచ్చినప్పుడు భూయజమాని, బిల్డర్ చెరిసగం తీసుకునేలా ఒప్పందం చేసుకోవడం సహజం.
భూమి విలువ పెరిగే కొద్దీ భూయజమానుల వాటా 60 నుంచి 70శాతం వరకూ ఉంటుంది. కానీ నగరానికి నడిబొడ్డున ఎంతో విలువైన దసపల్లా భూ ఒప్పందంలో మాత్రం డెవలపర్స్ 70శాతం కన్నా ఎక్కువ తీసుకునేలా.. భూ యజమానులుగా చలామణి అవుతున్నవారికి 30 శాతం కంటే తక్కువ ఇవ్వడం విస్మయపరుస్తోంది.
ఎష్యూర్ డెవలపర్స్ సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. షెడ్యూల్-ఎ, బీల్లో కలిపి మొత్తం 75,939 చ.గజాల స్థలం అందుబాటులో ఉంది. వీటిలో మొత్తం 27.55 లక్షల చ.అడుగుల్లో భవనాలు నిర్మించనున్నారు. ఇందులో 7లక్షల96 వేల580 చ.అడుగులు భూ యజమానులుగా చలామణి అవుతున్న వారికి, మిగిలిన19 లక్షల 58 వేల420 చ.అడుగుల భవనాల్ని డెవలపర్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నివాస, వాణిజ్య భవనాలు రెండింటినీ నిర్మిస్తున్నారు. కానీ స్థలాల యజమానులుగా చలామణి అవుతున్నవారికి కేవలం నివాస భవనాల్లో మాత్రమే ఫ్లాట్లు కేటాయిస్తున్నారు.
అంతర్గత లావాదేవీ ధరే చ.అడుగుకు రూ.6 వేలు: వాణిజ్య నిర్మాణాల్లో వాటా ఇవ్వకపోవడం మరింత చోద్యం . భూ యజమానులుగా చలామణి అవుతున్న వారి స్థలం విస్తీర్ణాన్ని బట్టి.. ప్రాజెక్టు పూర్తయ్యాక ఒక్కొక్కరికి ఎన్ని చ.అడుగుల నిర్మిత ప్రాంతం కేటాయించేదీ ఒప్పందంలోనే పేర్కొన్నారు. ఏ స్థల యజమానికైనా ఇప్పుడు కేటాయించిన బిల్టప్ ఏరియా కంటే ఎక్కువ వచ్చినా, వారి నుంచి కొంత బిల్టప్ ఏరియాను డెవలపర్ తీసుకోవలసి వచ్చినా చ.అడుగుకి రూ.6 వేల చొప్పున చెల్లించాలి. అంటే అంతర్గత లావాదేవీ కోసమే ఆ ప్రాజెక్టులో చ.అడుగు కనీస ధరను రూ.6 వేలుగా నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌లో చదరపు అడుగు ధర కనీసం 9వేలు ఉంది.
ఖరీదైన స్థలాలకు సంబంధించి ఒప్పందాల్లో స్థలాల యజమానులకు మెజారిటీ వాటా ఇవ్వడంతో పాటు గుడ్‌విల్ కింద కోట్ల రూపాయాల్లో చెల్లిస్తుంటారు. కానీ దసపల్లా భూములకు సంబంధించి స్థల యజమానులుగా చెలామణీ అవుతున్న వారికి డెవలపర్ ఇస్తున్న మొత్తం కేవలం 50 వేలు మాత్రమే. దసపల్లా స్థలాలపై హక్కుదారులమని చెబుతున్న వారు సామాన్య వ్యక్తులేమీ కాదు. వారిలో బడా వ్యాపారులు, బడా బిల్డర్లూ ఉన్నారు. వారి నుంచి ఒక డెవలపర్ అత్యంత కారుచౌకగా భూములు తీసుకోవడం ఇప్పుడు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆ సంస్థ వారిదేనని విపక్షాల ఆరోపణలు : దసపల్లా భూ యజమానులు డెవలప్‌మెంట్ ఒప్పందం చేసుకున్న ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ సంస్థ.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడికి చెందినదేనని విపక్షాలు ఆరోపించాయి. ‘దసపల్లా భూములకు యజమానులుగా చెబుతున్న 64 మందితో.. ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ సంస్థ 2021 జూన్, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. ‘నిషిద్ధ’ జాబితాలో ఉంచిన దసపల్లా భూములకు సంబంధించిన డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయడమే నిబంధనలకు విరుద్ధమని విపక్ష నేతలు విమర్శించారు.
ఇవీ చదవండి: