ఈ నెల 26న తలుపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.
'సీఎం పర్యటన వాయిదా వేసుకోవాలి'
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 26న భారత్ బంద్ నిర్వహిస్తున్నందున.. సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటనను వాయిదా వేసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు 26న జగన్ కర్నూలు వస్తున్నారని.. ఈ కార్యక్రమాన్ని 27కు వాయిదా వేసుకోవాలని నాయకులు కోరారు. రైతు, కార్మిక సంఘాల పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో బంద్ నిర్వహించనున్నామని జిల్లా నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బంద్‌కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.
ప్రజలందరు సహకరించాలి: మాజీ ఎమ్మెల్యే గఫుర్
భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గఫుర్ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ బంద్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరు దీనికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని ప్రచార యాత్ర..
కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ద్వారక తిరుమల మండలంలో రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహించారు.
ద్వారకా తిరుమల బస్టాండ్ సెంటర్లో ప్రారంభమైన ప్రచార యాత్ర.. తిమ్మాపురం, తిరుమలం పాలెం, గొల్లగూడెం, సూర్య చంద్ర రావు పేట, పంగిడిగూడెం, ఎం.నాగుల పల్లి గ్రామాల గుండా సాగింది. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాల వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు అన్నారు.
విశాఖలో పోస్టర్ ఆవిష్కరణ..
విశాఖలో పోస్టర్ ఆవిష్కరణ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 26న నిర్వహించనున్న భారత్ బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించాలని విశాఖ జిల్లా అఖిల పక్ష కార్మిక సంఘాలు - ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బంద్ పోస్టర్ని చైర్మన్ ఎం.జగ్గు నాయుడు ఆవిష్కరించారు.
విజయనగరంలో విద్యార్థి సంఘాల ర్యాలీ..
విజయనగరంలో విద్యార్థి సంఘాల ర్యాలీ.. భగత్ సింగ్ 90వ వర్ధంతిని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి సమైఖ్య విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టింది. ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ర్యాలీలో విజయనగరంలోని పలు కళాశాలల విద్యార్ధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కోట కూడలి నుంచి మయూరి కూడలి వరకు కేంద్ర ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. భగత్ సింగ్ వంటి త్యాగమూర్తుల ఫలితంగా స్వాత్రంత పొందిన దేశంలో భాజపా ప్రభుత్వం స్వేచ్చను హరిస్తోందని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ఆధునిక చట్టాలు, ప్రైవేటీకరణ పేరుతో యువతను కేంద్రం ఉద్యోగ అవకాశాలను దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం తీవ్రతరం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చిరించారు. ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
తిరుపతిలో బైక్ ర్యాలీ..
ఈనెల 26న ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారత్ బంద్‌కు ప్రజలు మద్దతివ్వాలని కోరుతూ తిరుపతిలో వామపక్ష సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ర్యాలీని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలను కోరారు. సాగు, విద్యుత్ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
ఇదీ చదవండి:
ఈ నెల 26న భారత్ బంద్‌కు తెదేపా మద్దతు