స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి చెందిన కిరాణ దుకాణాన్ని ఓటమి పాలైన వర్గం వారు తగలబెట్టారు. విశాఖ జిల్లా పెదబయలు మండలం బొంగరం పంచాయితీ పరిధిలో ఈ ఘటన జరిగింది. మూడో విడత ఎన్నికల్లో లక్ష్మీపతి అనే అభ్యర్థి 67 ఓట్ల తేడాతో చిట్టిబాబుపై గెలుపొందారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓడిన అభ్యర్థి వర్గం.. తమ కిరాణా దుకాణాన్ని తగలబెట్టిందంటూ గెలిచిన అభ్యర్థి వర్గం వారు ఆరోపించారు.
మూడు సొంత పాకలతో పాటు కిరాణా దుకాణంలో ఉన్న సామగ్రి, బట్టలు విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయని ఆవేదన చెందారు. పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి గిరిజన తెగలో ఓ సామాజిక వర్గం ఇప్పటివరకూ సర్పంచి పదవులు పొందుతూ వచ్చారని.. ఈసారి మరో వర్గం వారు గెలుపొందిన కారణంగానే.. ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వారు వాపోయారు. తొలుత మావోయిస్టుల పనిగా భావించినా... ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించగా... ఓడిన వర్గం వారిగా తెలిసిందన్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారే తప్ప.. ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎస్సై రాజారావు తెలిపారు.