Visakhapatnam Kidney racket scam latest news: నిరుపేదలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయకులే వాళ్ల టార్గెట్.. ముందుగా డబ్బు ఎర వేస్తారు.. లక్షల రూపాయలు ఆశ చూపిస్తారు. మాయమాటలతో మోసగించి శరీరంలోని అవయవాలను కాజేసి అమ్ముకుంటారు. ఇంటికి దూరంగా ఉంటున్న యువకులు, ఒంటరి మహిళలు, అప్పుల్లో ఉన్నవారిని ఎంచుకుని అవయవాలను అమ్ముకునేలా ప్రేరేపిస్తారు. అవయవాలు కాదంటే.. అద్దె గర్భం కోసం ఒప్పుకోవాలని మహిళలను ఒత్తిడి చేస్తారు. విశాఖలో చాపకింద నీరులా.. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందా.. ఓ బాధిత యువకుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ముగ్గురు సభ్యులున్న ఈ ముఠా దారుణాలపై ఎట్టకేలకు పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది.
పేదలే లక్ష్యంగా కిడ్నీ వ్యాపారం..విశాఖపట్టణంలో పేదలే లక్ష్యంగా.. అవయవాల వ్యాపారులు, దళారులు రెచ్చిపోతున్నారు. నగరానికి చెందిన ఇలియానా, అమె తనయుడు అజయ్, మరో వ్యక్తి కామరాజు ముగ్గురూ కలిసి.. పేదల కాలనీలలో ఉన్నవారిపై దృష్టిపెట్టి.. కిడ్నీ రాకెట్ నడిపిస్తున్నారు. పేదలను వారికి ఉన్న ఆర్థిక పరిస్ధితులను ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపుతూ.. కిడ్నీ ఇచ్చేలా లొంగదీసుకుంటున్నారు. మహిళలను అద్దె గర్భం కోసం పురిగొలుపుతున్నారు.
బాధితుడి ఫిర్యాదుతో బట్టబయలు..ఈ క్రమంలో గతకొన్ని నెలలుగా యథేచ్ఛగా సాగిన వారి కిడ్నీ వ్యాపారం.. వినయ్ కుమార్ అనే బాధితుడిచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వినయ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అదే ముఠా చేతిలో మోసానికి గురైన ఓ యువకుడు, మహిళ ముందుకు వచ్చారు. మరో మహిళకు కిడ్నీ ఇవ్వాలని లేకుంటే అద్దెగర్భం కోసమైనా ముందుకు రావాలని ముఠా సభ్యులు కోరినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
రూ. 8లక్షలన్నారు-రూ.2 లక్షలే ఇచ్చారు..ఇటీవలే మధురవాడ వాంబే కాలనీకి చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వినయ్‌కి స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కామరాజు అనే వ్యక్తితో కొంత కాలంగా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వినయ్ తన ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగాలేవని, తన పరిస్థితిని ఎలా అధిగమించాలో అర్ధం కావటం లేదని కామరాజుతో చెప్పుకున్నాడు. ఇదే అదునుగా భావించిన కామరాజు.. కిడ్నీ అమ్మితే రూ.8 లక్షల 50 వేలు వస్తాయని వినయ్‌కు చెప్పి నమ్మించాడు. పెందుర్తి తిరుమల ఆసుపత్రికి తీసుకెళ్లి కిడ్నీ తీయించి.. మొదటగా రూ.8 లక్షలు ఇస్తామని చెప్పిన కామరాజు.. రూ.2 లక్షల 50 వేలు మాత్రమే ఇవ్వడంతో తాను మోసపోయానని గ్రహించిన వినయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.