విశాఖ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గంజాయిని తరలిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి ఎవరికీ అనుమానం రాకుండా ఏజెన్సీ నుంచి రాష్ట్రాలు దాటించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2 కిలోల ద్రవ గంజాయి, బైకు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడు జి. మాడుగుల నుంచి ద్విచక్ర వాహనంపై ద్రవ గంజాయిని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
దువ్వాడ పీఎస్ పరిధిలో 107 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీని విలువ రూ. 2 లక్షల 14 వేలు ఉంటుందని తెలిపారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు, మరో నలుగురు నిందితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ ఏజెన్సీలో గంజాయిని కొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తరలిస్తుండగా.. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు.