కళ్యాణం కమనీయం.. ఓ వైభోగ౦. మనుషులు జరుపుకునే వివాహానికే ఎంతో సందడి ఉంటే.. మరి లోక కళ్యాణం కోసం జరిపే ఆ దేవతామూర్తుల కళ్యాణానికి ఇంకె౦త వైభోగ౦ ఉంటు౦ది. అ౦దుకే శ్రీరామనవమి రోజున అభిజిత్ లగ్నంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి.. విశాఖ గోపాలపట్నంలోని ఎల్లపువానిపాలెంలో గ్రామం మొత్తం కదిలివచ్చింది. రెండు రోజుల ముందు నుంచే కల్యాణం సందడి గ్రామంలో నెలకొంది.
సీతమ్మ వారి తరపున సారె పెట్టేందుకు పిండివంటల తయారీలో చిన్నా పెద్దా అంతా నిమగ్నమయ్యారు. ప్రతి ఇంటి నుంచి తమకు తోచిన వంటకాలను సిద్ధం చేశారు. అమ్మవారికి సిద్ధమైన సారెతో శనివారం సాయంత్రం గ్రామంలో భారీ ఊరేగింపునే నిర్వహించారు గ్రామస్థులు. మేళతాళాల నడుమ సీతమ్మ వారి సారెను కల్యాణానికి ఒకరోజు ముందే సీతారామ స్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ అర్చకులకు అప్పగించారు.