ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపఖండం ఆవిర్భావం వెనుక ఆసక్తికర విషయాలు - Continental rocks on the west coast news

భూ అంతర్భాగాల్లో శిలలపై చేసిన పరిశోధనల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత ఉపఖండంలో బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల్లో పరస్పర విరుద్ధమైన శిలలు ఉన్నట్లు గుర్తించారు. సముద్ర అంతర్భాగాల్లోని శిలలు, వాటి పరిణామక్రమంపై ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు గత 35 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు.

ఉపఖండం ఆవిర్భావం వెనుక ఆసక్తికర విషయాలు
ఉపఖండం ఆవిర్భావం వెనుక ఆసక్తికర విషయాలు

By

Published : Oct 19, 2020, 7:29 AM IST

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని భూమి, సముద్రం, వాతావరణ శాస్త్రాల విభాగం అధిపతి డాక్టర్‌ కె.ఎస్‌.కృష్ణ, మరో శాస్త్రవేత్త ఎం.ఇస్మాయిల్‌, విశాఖలోని సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (ఎన్‌.ఐ.ఒ.) శాస్త్రవేత్త కె.శ్రీనివాస్‌లు చేసిన పరిశోధనలకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని కరెంట్‌ సైన్స్‌ జర్నల్‌ ప్రచురించింది. పశ్చిమతీరంలో కాంటినెంటల్‌ శిలలు మహారాష్ట్ర వద్ద, తూర్పు తీరంలో ఓషియానిక్‌ శిలలు బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌ వద్ద ఉన్నట్లు నిర్ధారించారు.

* భూమి అంతర్భాగాల్లో లక్షల సంవత్సరాలుగా జరిగే భౌగోళిక మార్పులే ఖండాల విభజనకు కారణమని ఇప్పటికే గుర్తించారు. అలా పశ్చిమ తీర ప్రాంతంలోనూ ఖండాల విభజన ప్రక్రియ (కాంటినెంటల్‌ బ్రేకప్‌) మొదలైనప్పటికీ విభజన పూర్తికాకుండానే ఆగిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ విభజన ప్రక్రియలో భూమి కుంగిపోయిందని, ఆ భాగంలోకి సముద్రం నీరు వచ్చిందని విశ్లేషించారు. అందువల్లే భూమి అంతర్భాగాల్లో ఉండాల్సిన శిలలు (కాంటినెంటల్‌ రాక్స్‌) పశ్చిమ తీరంలోనూ ఉన్నట్లు నిర్ధారణకొచ్చారు. ఇక్కడ తీరం నుంచి దాదాపు 400 కి.మీ. వరకూ ఇలా ఉన్నట్లు తెలుస్తోందన్నారు.

* పశ్చిమ తీరానికి విరుద్ధమైన ప్రక్రియ తూర్పుతీరంలో జరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాలయాల నుంచి నదుల ద్వారా వచ్చిన మట్టి సముద్రాన్ని కప్పేయడంతో అది కాలక్రమేణా భూభాగంగా మారిపోయింది. అది జనావాస యోగ్యమైన భూమిగా మారడానికి లక్షల సంవత్సరాల సమయం పట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దాదాపు 23 మిలియన్‌ సంవత్సరాల నుంచి మట్టి పేరుకుపోవడం మొదలై ఐదారు వేల సంవత్సరాల కిందట అదంతా భూమిగా మారినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ జరిగిందనడానికి బంగ్లాదేశ్‌లోని అత్యధిక భూ భాగమే నిదర్శనమని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో భూమి అంతర్భాగాల్లో ఉండాల్సిన శిలల(కాంటినెంటల్‌ శిలలు)కు బదులు ఓషియానిక్‌ శిలలు ఉన్నట్లు గుర్తించారు.

అనూహ్య పరిమాణాలు సంభవించాయి
జియోఫిజికల్‌, ఇతరత్రా సమాచారాల్ని విశ్లేషించి తూర్పు, పశ్చిమ తీరాల్లో సుదూర ప్రాంతాల భూ అంతర్భాగాలపై పరిశోధనలు చేశాం. ఓఎన్‌జీసీ, యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే, పెట్రోలియం సంస్థలు చేసిన అధ్యయనాల ఫలితాల్నీ విశ్లేషించాం. తూర్పు, పశ్చిమ తీరాల్లో కొంత భాగంలో పరస్పర విరుద్ధమైన శిలలు ఉండడానికి కారణాలేమిటన్నది నిర్ధారించాం. అనూహ్య పరిణామాలు జరిగినట్లు గుర్తించాం.

- డాక్టర్‌ కె.ఎస్‌.కృష్ణ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

ఇదీ చదవండి:అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు

ABOUT THE AUTHOR

...view details