ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రమంతటా ముందుగానే సంక్రాంతి శోభ..

రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ముందస్తుగానే సంక్రాంతి శోభ కనిపిస్తోంది. అనేక చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు, రంగవల్లుల పోటీల్లో.. యువత, విద్యార్థులు, మహిళలు పాల్గొని ఉల్లాసంగా గడిపారు.

sankranti celebrations
రాష్ట్రమంతటా ముందుగానే వచ్చిన సంక్రాంతి శోభ

By

Published : Jan 11, 2021, 10:17 PM IST

విశాఖ జిల్లాలో..

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల పంపిణీ చేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలైన వారికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బహుమతులు పంపిణీ చేశారు. నియోజకవర్గలో ఈ నెల 6 నుంచి వివిధ స్థాయిల్లో పోటీలను నిర్వహించి తుది పోటీలను నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇందులో గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం రూరల్, నర్సీపట్నం మునిసిపాలిటీ ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. నర్సీపట్నంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అమ్మఒడి, విద్యా దీవెన, తదితర పథకాలకు సంబంధించిన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం ఉన్నత పాఠశాలలో సంక్రాంతి శోభ ముందే వచ్చింది. సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పేలా భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సంక్రాంతి పొంగలి తయారీ, బొమ్మలాటలు, బొమ్మల కొలువు వైభవమంతా విద్యార్థుల నడుమ ఉపాధ్యాయులు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లత ఆధ్వర్యంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేశారు. నృత్య ప్రదర్శనలు, కోలాటం ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రాజన్న గూడెం కామయ్యపాలెం గ్రామాల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి అభ్యున్నతికి పాటు పడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సుపరిపాలన చూసి వోర్వలేని ప్రతిపక్ష నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

కోనసీమలో..

మరో 24 గంటల్లో సంక్రాంతి మొదలుకానుంది. కోనసీమలోని పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఇళ్ళ ముందు వాకిళ్ళలో రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. అందమైన ముగ్గులతో కోనసీమలోని లోగిళ్లలో సంక్రాంతి సందడి సంతరించుకుంది. వివిధ సంస్థలు, సంఘాల వారు మహిళలకు రంగవల్లుల పోటీలు ఏర్పాటు చేయగా.. మహిళలు పాల్గొని అందమైన ముగ్గులు వేసి పోటీ పడుతున్నారు.

గుంటూరు జిల్లాలో..

గుంటూరు జిల్లా విజ్ఞాన్‌లో విశ్వవిద్యాలయంలో సంక్రాంతి ముందస్తు సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. విద్యార్థినులు రంగవల్లులు తీర్చిదిద్దటంతోపాటు.. వ్యాసరచన , క్విజ్, మెహందీ పోటీలు నిర్వహించారు. గాలిపటాల ఎగురవేసి పండుగకు కొత్త శోభ తీసుకువచ్చారు. సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.

సంక్రాంతి అంటేనే సరదాల పండుగ అని విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సోమవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాల్లో పల్లెటూళ్లు ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయని గుర్తుచేసుకున్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి:ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details