రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. విశాఖ జిల్లాలో ఇసుక లభ్యమయ్యే రీచ్లు ఎక్కువగా లేనందున తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని నదుల నుంచి ఇసుక తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇందుకోసం భీమిలి, అనకాపల్లి, చోడవరం, అగనంపూడి, నక్కపల్లి, నర్సీపట్నం, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో అధికారికంగా ఇసుక డిపోలు ఏర్పాటుచేశారు.
కరవైన పర్యవేక్షణ
ఇసుక అవసరమైనవారు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. టన్ను రేటు రూ. 375 కాగా.. రవాణా ఛార్జీలు అదనం. రాజమండ్రి, శ్రీకాకుళం నుంచి ఆయా డిపోలకు ఉన్న దూరాన్ని బట్టి కనిష్టంగా రూ. 1250, గరిష్టంగా రూ. 1450 వరకు టన్ను రేటు ఉంది. ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన వినియోగదారులు తమకు సమీపంలో ఉన్న డిపోల నుంచి ఇసుక తీసుకెళ్లాలి. అయితే డిపోలో సరైన పర్యవేక్షణ లేక సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తూకం వేయకుండా లోడింగ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఫోన్ చేస్తే బుక్ చేసినదానికన్నా ఎక్కువ ఇసుక ఇస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంతో వాస్తవంగా డిపోలకు వచ్చిన ఇసుక, కొనుగోలుదారులు తీసుకెళ్లిన ఇసుక మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి సరఫరా అయిన ఇసుకకు.. ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఆయా డిపోల్లో విక్రయించిన ఇసుకకు వేలాది టన్నుల తేడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీఎండీసీ అధికారులు రంగంలోకి దిగి వాస్తవ పరిస్థితిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
కోటీ 63 లక్షల విలువైన ఇసుక గల్లంతు