రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం పేర్కొన్నారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనకాపల్లిలో తమ కుటుంబానికి చెందిన 3920 గజాల స్థలాన్ని వైకాపా అధికార ప్రతినిధి దాడి వీరభద్రరావు కుమారుడు జయవీర్ ఆక్రమించారని సీతారాం ఆరోపించారు. స్థానిక తహసీల్దార్‌ని అడ్డు పెట్టుకుని తన అరుచరుడైన సూరిశెట్టి బాల పేరు మీదుగా జయవీర్ రిజిస్ట్రేషన్ చేయించారని అన్నారు.
స్థానిక పోలీసు స్టేషన్ నుంచి సీఎం కార్యాలయం వరకు ఎన్ని పిర్యాదులు చేసినా పట్టించుకునే వారు లేరని వాపోయారు. తనను హత్య చేస్తామని దాడి కుటుంబం బెదిరింపులకు దిగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా హయంలో పలు సమస్యలపై ఆందోళనలు నిర్వహించినా... హత్య చేస్తామనే బెదిరింపులు రాలేదన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తమకు న్యాయం జరగపోతే... న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.