ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lands at Vishaka: 'విశాఖలో రూ.1,500 కోట్ల భూమిని.. చౌకగా కొట్టేస్తున్నారు' - Rs 1,500 crores land Lands scam at Vishakhapatnam

TDP on Madhurawada Lands: విశాఖ మధురవాడలో అత్యంత విలువైన 97.35 ఎకరాల భూమిని చౌకగా కొట్టేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. రూ.1,500 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.187 కోట్లకే ఎస్​సీసీ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టిందని... ఇందులో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల హస్తం ఉందని తెలుగుదేశం పేర్కొంది. తెదేపా విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు.. మధురవాడలో ఎన్‌సీసీ సంస్థకు ప్రభుత్వం విక్రయించిన భూమిలో ఆందోళన చేపట్టారు.

TDP on Madhurawada Lands
Lands at Vishaka

By

Published : Apr 5, 2022, 5:01 AM IST

Madhurawada lands Issue: విశాఖలోని మధురవాడలో అత్యంత విలువైన 97.35 ఎకరాల భూమిని ఎన్‌సీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.187 కోట్ల అతి తక్కువ ధరకు కట్టబెట్టిందని, దీని వెనుక ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి హస్తం ఉందని ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఆరోపించింది. రూ.1,500 కోట్ల విలువైన ఆ భూమిని కారు చౌకగా కొట్టేసేందుకు విజయసాయిరెడ్డి వేసిన పన్నాగంలో భాగంగానే దానిని ఎన్‌సీసీ సంస్థకు ప్రభుత్వం చౌకగా ఇచ్చేసిందని, ఇప్పుడు అదే భూమిని ఎన్‌సీసీ సంస్థ... జీఆర్‌పీఎల్‌ హౌసింగ్‌ లిమిటెడ్‌ అనే విజయసాయిరెడ్డి బినామీ కంపెనీకి రూ.200 కోట్లకు అమ్మేస్తోందని తెదేపా నాయకులు ఆరోపించారు. తెదేపా విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ దక్షిణ, భీమిలి నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు గండి బాబ్జీ, కోరాడ రాజబాబు తదితరులు... మధురవాడలో ఎన్‌సీసీ సంస్థకు ప్రభుత్వం విక్రయించిన భూమిలో సోమవారం ఆందోళన చేపట్టారు.

జీఆర్‌పీఎల్‌ 2018లో కేవలం లక్ష రూపాయల పెయిడప్‌ కేపిటల్‌తో మొదలైన కంపెనీ అని, అది ఎన్‌సీసీ నుంచి అంత విలువైన భూమిని ఎలా కొంటోందని వారు ప్రశ్నించారు. పైగా 97.35 ఎకరాల భూమి విలువను అతి తక్కువగా చూపించి ఎన్‌సీసీకి ఏపీ హౌసింగ్‌ బోర్డు (ఏపీహెచ్‌బీ) విక్రయించడం వల్ల ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ ఫీజుల రూపంతో చాలా నష్టం వచ్చిందని బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం అక్కడ ఎన్‌సీసీ సంస్థ చేపట్టే ప్రాజెక్టులో వచ్చే లాభాల్లో హౌసింగ్‌ బోర్డుకు కొంత శాతం చెల్లించాలని, ఆ హక్కును వదులుకుని మొత్తం భూమిని పూర్తిగా విక్రయించడమేమిటని ఆయన మండిపడ్డారు.

అడ్డగోలుగా అమ్మేశారు
‘‘మధురవాడలో ఐటీ పార్కులు, అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి 2005లో అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిచి 97.35 ఎకరాల భూమిని ఎన్‌సీసీ సంస్థకు కేటాయించింది. ప్రభుత్వానికి ఎకరానికి రూ.93.20 లక్షల చొప్పున చెల్లించేందుకు, ప్రాజెక్టు పూర్తయ్యాక నివాస భవనాల విక్రయాల్లో వచ్చే లాభంలో 3.5 శాతం, వాణిజ్య భవనాల విక్రయాల ద్వారా వచ్చే లాభంలో 4 శాతం, ఐటీ జోన్‌లో 4 శాతం హౌసింగ్‌ బోర్డుకి ఇవ్వాలన్నది... ఎన్‌సీసీ, ఏపీహెచ్‌బీ మధ్య కుదిరిన ఒప్పందం. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ భూమిని పూర్తి హక్కులతో ఎన్‌సీసీ సంస్థకు విక్రయించాలని నిర్ణయించింది. ఎన్‌సీసీ 2005లో రూ.90 కోట్లు చెల్లించింది. ఇప్పుడు మరో రూ.97 కోట్లు చెల్లించే ప్రాతిపదికన... మొత్తం విలువ రూ.187 కోట్లుగా చూపించి అడ్డగోలుగా అమ్మేశారు...’’ అని తెదేపా నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

‘‘ఆ స్థలంలో ప్రాజెక్టు అభివృద్ధికి ఎన్‌సీసీ సంస్థ... ఎన్‌సీసీ వైజాగ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేసింది. సింగపూర్‌కి చెందిన మస్తుడో ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. సింగపూర్‌ సంస్థతో రూ.75 కోట్ల పెట్టుబడులు పెట్టించింది. ఇప్పుడు ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని కాలదన్ని... వైజాగ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థను బెంగళూరుకు చెందిన జీఆర్‌పీఎల్‌ హౌసింగ్‌ సంస్థకు రూ.200 కోట్లకు విక్రయించేస్తోంది. జీఆర్‌పీఎల్‌ నుంచి పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించడంతో ఎన్‌సీసీ సంస్థ షేర్‌ విలువ పెరిగింది. ఆ విధంగా ఎన్‌సీసీ సంస్థ లబ్ధి పొందింది...’’ అని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.

ప్రభుత్వానికి భారీగా నష్టం...!
‘‘2005లో ఎన్‌సీసీ సంస్థకు భూమి కేటాయించినా ఇప్పుడు మధురవాడ రూపురేఖలు బాగా మారిపోయాయి. ఆ ప్రాంతం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడక్కడ చదరపు గజం భూమి విలువ రూ.40 వేలకు తక్కువ లేదు. పైగా ఇప్పుడక్కడ రిజిస్ట్రేషన్లన్నీ చదరపు గజాల్లోనే జరుగుతున్నాయి. ఆ 97.35 ఎకరాల భూమి విలువ ఇప్పుడు కనీసం 1,500 కోట్లు ఉంటుంది. కానీ రూ.187 కోట్లకు ఆ భూమిని అడ్డగోలుగా అమ్మేయడంతో... రిజిస్ట్రేషన్‌ విభాగానికి రూ.14 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అదే గజాల్లో రిజిస్ట్రేషన్‌ చేసి ఉంటే... ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం వచ్చేది...’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

‘‘ప్రస్తుతం అక్కడ ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఏ ప్రాజెక్టు చేపట్టినా హాట్‌కేక్‌లా అమ్ముడవుతాయి. అలాంటి ప్రాజెక్టులో ఏపీ హౌసింగ్‌ బోర్డు తనకున్న వాటాను వదులుకుని పూర్తి హక్కులతో ఎన్‌సీసీకి అమ్మేయడమే కాకుండా, దాని విలువను ఎకరం రూ.2 కోట్లుగా ఎలా లెక్కిస్తుంది? ప్రభుత్వం మళ్లీ బహిరంగ వేలం ఎందుకు నిర్వహించలేదు? ప్రభుత్వం ఆ భూమిని పూర్తి హక్కులతో విక్రయించాలనుకున్నప్పుడు బహిరంగ వేలం నిర్వహిస్తే ఎకరానికికనీసం రూ.15 కోట్లు వేసుకున్నా... సుమారు రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చేది...’’ అని పేర్కొన్నారు.

‘‘భీమిలి నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న ఈ భూభాగోతంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రమేయం కూడా ఉంది. మా ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి. 2005లో భూములు తీసుకున్న ఎన్‌సీసీ సంస్థ అక్కడ ఒక్క ఇటుక రాయి కూడా వేయలేదు. అలాంటి సంస్థకు భూముల్ని పూర్తి హక్కులతో విక్రయించేటప్పుడు బహిరంగ మార్కెట్‌లో ఇప్పుడున్న విలువల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఏపీహెచ్‌బీ తన ఇష్టం వచ్చిన ధరకు ఎలా విక్రయిస్తుంది? ఎకరం విలువ రూ.2 కోట్లని ఎలా అంచనాకు వచ్చింది? తక్కువ విలువకు రిజిస్ట్రేషన్‌ చేస్తుంటే... రిజిస్ట్రేషన్‌ శాఖ ఏం చేస్తోంది? మొదట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం... నిర్మాణరంగంలో అనుభవం ఉన్న విదేశీ భాగస్వామిని ఎన్‌సీసీ చేర్చుకోవాలి. దానికి భిన్నంగా సింగపూర్‌ కంపెనీని బయటకు పంపేసి... ఏమాత్రం అనుభవం లేని జీఆర్‌పీఎల్‌తో ఎలా ఒప్పందం చేసుకుంటుంది? అది సూట్‌కేస్‌ కంపెనీ. జె-బ్రాండ్‌ మద్యం విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుని దానిలో పెడుతున్నారు...’’ అని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

న్యాయ పోరాటం చేస్తాం:జీఆర్‌పీఎల్‌ ముమ్మాటికీ జగన్‌, విజయసాయిరెడ్డిల బినామీ కంపెనీనే. 2018లో ఏర్పాటై కనీసం ఆదాయపన్ను రిటర్న్‌లు కూడా దాఖలు చేయని ఆ కంపెనీతో ఎన్‌సీసీ ఒప్పందం చేసుకోవడం ఒక కుట్రలో భాగం. ఎన్‌సీసీని బెదిరించి ఆ భూములు లాక్కున్నారు. ఆ కంపెనీ డైరెక్టర్‌ కొట్టు మురళీకృష్ణ పేరు మీద సుమారు 20 సూట్‌కేస్‌ కంపెనీలు ఉన్నాయి. రూ.1,500 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు జరుగుతున్న పన్నాగంపై న్యాయ పోరాటం చేస్తాం.- వెలగపూడి రామకృష్ణబాబు, తెదేపా నేత

ఇదీ చదవండి:వికేంద్రీకరణే మా విధానం.. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన పాలన: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details