RRR Oscar Celebrations : ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను నిర్వహించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది తెలుగు వారందరికీ దక్కిన గౌరవమని వక్తలు పేర్కొన్నారు. సోమవారం డైమండ్ పార్కు సమీపంలోని ఓ హోటల్‌లో వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఈ విజయోత్సవ సభకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజుతో పాటు విశాఖలోని సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పలువురు కళాకారులు హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఆస్కార్‌కు తెలుగు చిత్రం నామినేట్ కావడం, అవార్డు తీసుకోవడం చాలా ఏళ్ల తరవాత జరిగిందని అన్నారు. గతంలో తెలుగు సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయినా అవార్డులు రాలేదని, ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారన్నారు. ఆర్ఆర్ ఆర్ కు ఆస్కార్ రావడం పై ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. సినిమాలు తీయడంలో రాజమౌళి దిట్టని, తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాజమౌళి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారని గంటా అన్నారు. సినిమా ప్రమోషన్ కోసం 80 కోట్ల ఖర్చుపెట్టారని కొంతమంది వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఎంత డబ్బులు ఖర్చుపెట్టినా సినిమాలో కంటెంట్ ఉండాలి. సినిమాను తీయడంలోనే కాదు ప్రమోషన్‌లోనూ రాజమౌళి దిట్టని ప్రశంసించారు. విశాఖ సినిమా పరిశ్రమకు కేంద్రం అవుతుందని, అనేక సినిమా ఈవెంట్లు విశాఖలో జరుగుతున్నాయన్నారు.