విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణ అనుసరించాలని సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.జెగ్గునాయుడు సూచించారు. అన్ని కార్మిక సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో స్థానిక సమావేశాలు నిర్వహించి నిరసన తెలపాలని, ఇందులో భాగంగా సామాన్య ప్రజలను, మేధావులను భాగస్వామ్యం చేసుకోవాలని కోరారు.
నగరంలోని అన్ని పరిశ్రమల వద్ద మీటింగులు, నివాస ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించాలని కోరారు. ఫిబ్రవరి 18న నగరంలో భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తామని నేతలు చెప్పారు.