విశాఖ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పామ్ బీచ్ హోటల్ పార్కింగ్‌లో జరిగిన దొంగతనాన్ని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. చోరీ సొత్తును స్వాధీన పరుచుకుని నిందితులను అరెస్టు చేశారు. కూతురు నిశ్చితార్థం కోసం పామ్ బీచ్ హోటల్‌కు వచ్చిన రామలక్ష్మి అనే మహిళ.. కారును పార్కింగ్‌లో ఉంచి హోటల్ గదిలోకి వెళ్లారు. కంగారులో ఆమె కారు అద్దం వేయడం మరిచిపోయారు. కొద్దిసేపటి తరువాత వచ్చి చూసుకోగా కారులో వదిలివెళ్లిన నగల బాక్స్ కనిపించలేదు. వెంటనే మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎంవీపీ ప్రాంతంలో టిఫిన్ సెంటర్ నడుపుతున్న రాజమహేంద్ర, రేవతి, విశ్వేశ్వరరావు, వినోద్ కుమార్‌లను విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. చోరీకి గురైన నాలుగు లక్షల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్, బ్రేస్ లెట్, తొమ్మిది వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.