ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిఘా వేశారు.. దొంగలను పట్టారు.. - విశాఖపట్నంలో దొంగల హల్ చల్

విశాఖ నగర పరిధిలో జరిగిన నాలుగు దొంగతనాలకు సంబంధించిన కేసులను పోలీసులు ఛేదించారు. దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.80 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నగర నేర విభాగపు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. అలాగే రాష్ట్రంలో జాతీయ రహదారి పక్కన ఉండే వివిధ ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న కర్రి దేవుడు, లక్ష్మణ్ అనే వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసుకు సంబంధించి గాజువాకలో చైన్ స్నాచింగ్​కు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు.

robbers arrest at vishakapatnam
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సురేష్‌బాబు, ఇతర అధికారులు

By

Published : Oct 2, 2020, 2:08 PM IST

విశాఖలో పోలీసులు నిఘా పెట్టి దొంగల ఆట కట్టించారు. డీసీపీ (క్రైమ్‌) సురేష్‌బాబు ఏడీసీపీ వేణుగోపాలనాయుడు, ఏసీపీ పెంటారావు, సీఐలు సింహాద్రినాయుడు, అవతారంతో కలసి వివరాలు వెల్లడించారు.

దోచుకున్న సోత్తు

విఘ్నేశ్వరుడి ఆభరణాల దొంగలు దొరికారు

ఆగస్టు 20 తెల్లవారుజామున సాలిగ్రామపురంలోని త్రిమూర్తిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో దొంగతనం జరిగిందని, సుమారు 2.4 కిలోల వెండి ఆభరణాలు, 3 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. పాత డెయిరీ ఫారానికి చెందిన కె.జగదీష్‌బాబు, కె.దుర్గాప్రసాద్‌, ఓ మైనర్‌ పాత్ర దొంగతనంలో ఉన్నట్లు గుర్తించారు. ఒక ద్విచక్రవాహనాన్ని దొంగిలించి దానిపై వెళ్లి.. సాలిగ్రామపురం దేవాలయంలో తెల్లవారుజామున ఆలయం తాళాలు బద్దలు కొట్టి, ఆలయంలో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను దొంగలించారు. వీరు అక్కయ్యపాలెం దాలిరాజు సూపర్‌ మార్కెట్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని, వారి నుంచి ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగదీష్‌బాబు, దుర్గాప్రసాద్‌లపై గతంలో ఎలాంటి కేసులు లేవు. వీరిని అరెస్టు చేశారు.

సిలిండర్లు మాయం

ఆగస్టు 28న రామ్‌నగర్‌లోని అపార్టుమెంట్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్యాస్‌ సిలిండర్‌, రూ.8వేలు నగదు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గోపాలపట్నం, స్టీల్‌ప్లాంట్‌ స్టేషన్ల పరిధిలోనూ గ్యాస్‌ సిలిండర్లు దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. అనధికారికంగా సిలిండర్లను విక్రయించేందుకు సిద్ధమవుతున్న వ్యక్తుల గురించి పోలీసులు ఆరా తీశారు. సమాచారం అందుకుని దొంగతనానికి పాల్పడింది సికింద్రాబాద్‌కు చెందిన పి.కృష్ణారెడ్డి(51)గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి, మూడు సిలిండర్లు, దొంగలించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హనుమాన్‌ ఆలయాలే లక్ష్యంగా

పెదగంట్యాడ దరి గంగవరం గ్రామంలో రాజేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి ముందు నిద్రపోతుండగా.. మెడలో నుంచి గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకుని పారిపోయారు. గంగవరం ప్రాంతానికి చెందిన చేపల ఆనంద్‌కు గతంలో నేరాలతో సంబంధం ఉండటంతో అతనిపై నిఘా ఉంచారు. ఆనంద్‌, కె.దేముడు, బి.లక్ష్మణరావులతో కలిసి తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. గొలుసు దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు. వీరు గొలుసు దొంగతనాలే కాకుండా విశాఖ రూరల్‌ పరిధిలోని రాంబిల్లిలోని వీరాంజనేయస్వామి ఆలయంలోనూ హుండీ దొంగతనం, పరవాడ మార్గంలోని మరో హనుమంతుని ఆలయంలోనూ హుండీ దొంగతనాలు చేశారు. అతన్ని అరెస్టు చేసి తులం బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. దేముడు, లక్ష్మణరావులను రూరల్‌ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: చలో మదనపల్లె: తిరుపతిలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాల నేతల అరెస్టు

ABOUT THE AUTHOR

...view details