Coal Pollution On Roads: కాలుష్య కారకాలలో అగ్రస్ధానంలో ఉన్న ముడి పదార్ధాలలో బొగ్గు ఒకటి. బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామాలు, వాటికి వెళ్లేరహదార్ల పరిస్దితి లో మరింతగా తీవ్రంగా ఉంటుంది. గాలి జోరు ఎక్కువైందంటే ఇక ఆ రహదారిమీద వెళ్లే వారి పరిస్ధితి వర్ణనాతీతం. విశాఖ అంతా ఈ సమస్య కన్పిస్తుంది. అనకాపల్లి జిల్లా ఎన్టీపీసీ పరవాడ పరిసర గ్రామాల మీదుగా వెళ్లే రహదారి కాలుష్య పరిస్దితిపై కథనం.
రహదారిపై బొగ్గు పడితే అది గాలికి ఎగిరి వాహనదారులకు కలిగించే ఇబ్బంది అంతా ఇంతా కాదు. డ్రైవింగ్ సమయంలో ఒక చిన్న రేణువు కంట్లో పడితే ఆ బాధ వర్ణనాతీతం. అనకాపల్లి జిల్లా లంకెల పాలెం, పరవాడ సమీపాన వెళ్లే ప్రధాన రహదారి అత్యంత దయనీయంగా మారింది. వేగ నియంత్రికల వద్ద బొగ్గు కింద పడటంతో పాటు నియంత్రణ లేని బొగ్గు లారీలతో పారి గాలికి ఎగిరి వెనకాల వచ్చే శ్రామిక ప్రాంతాల్లోని ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు, అవస్థలు పడుతున్నారు. లారీలపై పరదాలు నామమాత్రంగా ఉండడం వల్ల అవన్నీ కిందకే జారుతున్నాయి. జాతీయ రహదారి మీదుగా యథేచ్ఛగా రాకపోకలు సాగించి లంకెలపాలెం కూడలి నుంచి పరవాడ మార్గంలో రోడ్డు మార్గం వెంబడి ఫార్మాసిటీ, పాలవలస, అచ్యుతాపురం లోని కంపెనీలకు నిత్యం ప్రయాణిస్తుంటాయి.
లంకెలపాలెం పైవంతెన వద్ద పేరుకుపోయిన బొగ్గు అంచులు వెంబడి ప్రమాదకర పరిస్ధితి ఎదురుతోంది. పేరుకు పోయిన బొగ్గు మీదుగా వాహనాలు రాకపోకల వల్ల నలిగి బూడిదగా మారి గాలికి ఎగురడం రహదారి పక్కనున్న నివాసితులు, ద్విచక్రవాహన చోదకులకు నరకం కనిపిస్తోంది.