పరిపాలన అనుమతులిచ్చిన ప్రభుత్వం
విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పరిధి పలు ప్రాంతాల్లో బృహత్తర ప్రణాళిక రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆయా ప్రాంతాల్లోని అవసరాలు, చుట్టూ జరుగుతున్న అభివృద్ధి, ఇతర డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అధికారులు వీటిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వాటికి రూ.47 కోట్లతో పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతులు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కొత్తవలస-సబ్బవరం, పెదముషిడివాడ-ట్రైజంక్షన్, భీమిలి-తగరపువలస, విశాఖ నగర పరిధిలో మరో రహదారికి టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించనున్నారు.
భీమిలి-తగరపువలస రోడ్డుకు ప్రాధాన్యం
వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన బృహత్తర ప్రణాళిక రహదారుల్లో భీమిలి-తగరపువలస రహదారికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. సాధారణంగా 80, 100 అడుగుల్లో రోడ్లు వేయగా ఇక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని 150 అడుగుల్లో విస్తరించనున్నారు. ఈ బృహత్తర ప్రణాళిక రోడ్డు భీమిలి పోలీసు స్టేషన్ నుంచి తగరపువలస వరకు రానుంది.