ROAD FOR SARADHA PEETAM : విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం కొత్తవలస గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 102, 103ల్లోని జనావాసం లేని కొండపైకి వీఎంఆర్‌డీఏ ఏకంగా రోడ్డు నిర్మాణం చేపట్టింది. కొండపై జనావాసం లేదు. లేఅవుట్లూ వేయలేదు. ఎటువంటి నిర్మాణాలూ కనిపించవు. ప్రస్తుతానికి అక్కడ ఏ రకమైన ప్రజోపయోగం లేకపోయినా రూ.1.75 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తోంది.
విశాఖ శారదా పీఠానికి ప్రభుత్వం కేటాయించిన స్థలానికి వెళ్లే మార్గం గుండానే ఈ రోడ్డును ప్రతిపాదించారు. పీఠం అవసరాల కోసమే రోడ్డు నిర్మిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలోని చినముషిడివాడలో ఉన్న శారదా పీఠానికి భీమిలి మండలం కొత్తవలసలో ఏడాది కిందట విలువైన ప్రభుత్వ భూములను కేటాయించారు. ఈ కొండపై సర్వే నంబరు 102/2లో 7.70 ఎకరాలు, 103లో 7.30 ఎకరాలను సంస్కృత వేద పాఠశాలకు కేటాయించారు.
విశాఖ నగర పరిధిలో కనుచూపు మేరలో సముద్రపు అందాలు కనిపిస్తూ, ఆహ్లాదకర వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఎకరా దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ప్రభుత్వ మార్కెట్ విలువకు ఇచ్చేలా తొలుత నిర్ణయం తీసుకున్నా ఎకరా రూ.లక్ష చొప్పున రూ.15 లక్షలకు కారుచౌకగా పీఠానికి అప్పగించారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ స్థలం మీదుగా రోడ్డు నిర్మాణానికీ పూనుకుంది. నేరుగా శారదా పీఠానికి రోడ్డు వేస్తే విమర్శలు వస్తాయని అధికారులు భావించినట్లున్నారు. అదే కొండపై వీఎంఆర్‌డీఏకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఈ భూముల వైపు రోడ్డు నిర్మాణ ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారు.