వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి Road Accidents in Various Districts: అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మంచు వంటి వివిధ కారణాల వల్ల రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. వాహనాల సంఖ్య పెరగటం, స్పీడ్ లిమిట్ పాటించకపోవటం, డ్రైవింగ్ పట్ల నిర్లక్ష్యం, వచ్చిరాని డ్రైవింగ్‌తో రోజుకు వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగి రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు పాటించిన ఎదుటివారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి రహదారిపై ఎక్కడ, ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఇటువంటి భయానక వాతావరణంలో రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలో గురువారం, శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న పలు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఎనిమిది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పొగమంచు ఎఫెక్ట్, విశాఖలో వరుసగా ఢీకొన్న ఐదు వాహనాలు
Accident In Visakhapatnam: విశాఖలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. విశాఖ వ్యాలీ స్కూల్ దగ్గర జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తున్న భార్యాభర్తలను వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ ఎగిరి కిందపడ్డారు. ఇంతలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరి మీదుగా వెళ్లటంతో చక్రాల కింద నలిగి భార్యా, భర్తలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతులు శ్రీకాకుళం జిల్లా సారవకోట వాసులుగా పోలీసులు గుర్తించి వివరాలను సేకరిస్తున్నారు.
Eluru: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెదవేగి మండలం ముండూరుకు చెందిన చవటపల్లి రాటాలు, అతని భార్య అమ్మాజీ టీవీఎస్ (TVS) మోపెడ్‌పై గురువారం దుగ్గిరాల నుంచి బైపాస్ రోడ్డులో తిరిగి వస్తున్నారు. రత్నబార్ సమీపంలో విజయవాడ నుంచి తాడేపల్లి గూడెం వైపు వెళుతున్న కారు అతి వేగంగా వస్తూ అదుపుతప్పి భార్యాభర్తలు ప్రయాణిస్తున్న మోపెడ్ ను వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాటాలు, అతని భార్య అమ్మాజీ అక్కడికక్కడే మృతి చెందారు.
పల్నాడు జిల్లాలో కారు బీభత్సం - రెండు బైకులను ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం
Tirupathi: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలలో ఒక యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమల ఘాట్‌రోడ్డు 16వ మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో విజయవాడకు చెందిన దాసరి జ్యోతి మృతి చెందింది. శ్రీవారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తన భార్య జ్యోతి మరణించటంతో సంతోష్ శోకసంధ్రంలో మునిగిపోయారు. ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడింగ్ చేస్తుండగా 16 మలుపు వద్ద బస్సు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన జ్యోతిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. 14వ మలుపు వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకి చెందిన లోకేశ్వరి అనే మహిళ కాలు విరిగింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Vijayawada: హైదరాబాద్ బాలాపూర్ నుంచి విజయవాడకు వస్తున్న కారు ఈరోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు సమీపంలో ప్రమాదానికి గురై ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొంది. దీంతో కారులో మంటలు చెలరేగటంతో అందులో ప్రయాణిస్తున్న సోదరులు గోదావరి అఖిల్ (22), గోదావరి జాన్సన్ (25)లకు గాయాలవ్వాయి. ఒకరికి కాలు విరిగింది. వీరిని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపుచేశారు. మంచు వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం