విహారయాత్ర ఆ నాలుగు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖ జిల్లా అరకులోయ నుంచి కిందికి వస్తున్న ఓ టూరిస్టు బస్సు లోయలోకి దూసుకెళ్లి చిన్నారి సహా నలుగురు చనిపోయారు. మృతులు, క్షతగాత్రులంతా నాలుగు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు. హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన కె.సత్యనారాయణ రిజర్వు బ్యాంకులో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రల కోసం ఈనెల 10న దినేష్ ట్రావెల్స్ మినీ బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం రాత్రి సింహాచలం వసతిగృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం అరకు వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో సరదాగా గడిపారు. బొర్రా గుహలను సందర్శించి తిరుగు ప్రయాణంలో రాత్రి ఏడింటికి బొర్రా, టైడాకు మధ్యన మలుపు వద్ద బస్సు లోయలో పడింది. సుమారు 80 అడుగుల లోతులో పడిపోవడంతో చిన్నారి శ్రీనిత్య (8నెలలు), కొట్టం సత్యనారాయణ (62), కె.సరిత (40), ఎన్.లత (40) ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఎస్.కోట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి అందరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ప్రమాద వివరాల కోసం విశాఖ కలెక్టరేట్‌లో 0891 2590102, 0891 2590100 కంట్రోల్‌రూం నంబర్లను ఏర్పాటుచేశారు. అరకులోయ నుంచి తిరిగి వస్తున్నప్పుడే బస్సు బ్రేకులు ఫెయిలైనట్లు డ్రైవర్ శ్రీశైలం గుర్తించాడు. బస్సులోని వారికి తెలపడంతో వారు కేకలు వేశారు. అప్పటికే ఘాట్ రోడ్డు దిగువకు వస్తుండడంతో బస్సును నియంత్రించడం కష్టమైంది. అయిదో నంబర్ మలుపు వచ్చేసరికి నియంత్రణ సాధ్యంకాక నేరుగా లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన అరగంట తరువాత షాక్‌లోంచి తేరుకుని చూస్తే తాను చెట్టు కొమ్మకు వేలాడుతున్నానని, బస్సులోని వారంతా చెల్లాచెదురై ఉన్నారని క్షతగాత్రుడు నరేష్‌కుమార్ చెబుతున్నారు. వీరి బ్యాగులు, సామగ్రి అంతా సింహాచలంలోనే ఉంది. శుక్రవారం రాత్రి సింహాచలం చేరుకుని శనివారం స్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్లిపోవాలనుకున్నారు. ఇంతలో ఘోరం జరిగింది.
మా పాప ఎక్కడ?
తీవ్రంగా గాయపడిన మౌనికకు తన 8నెలల కుమార్తె శ్రీనిత్య చనిపోయిన విషయం తెలియదు. ఎస్.కోట ఆసుపత్రిలో చికిత్స పొంది స్పృహలోకి వచ్చాక ‘అందరూ కనిపిస్తున్నారు.. నా కూతురు ఎక్కడుందో చెప్పండ’ని కుటుంబీకులను అడగడం చూపరులను కలచివేసింది.
మృతులంతా హైదరాబాద్ వాసులే...