అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడి ఇంటి కొలతల వ్యవహారంలో అధికారులు సర్వేకి శ్రీకారం చుట్టారు. ఇంటి ముందు భాగంలోని కృష్ణదేవిపేట మార్గంలో.. పోలీసులు, రెవెన్యూ అధికారులు కొలతలు కొలిచారు. ఆర్అండ్బీ రోడ్డు భవన నిర్మాణం ఎంత దూరంలో ఉందో పరిశీలించారు. ఆర్అండ్బీ అధికారులు లేకుండా సర్వే ఎలా చేస్తారని తెదేపా కార్యకర్తలు అధికారులను ప్రశ్నించారు. ఇంటి వెనుక రెండు సెంట్లు ఆక్రమణకు గురైందంటూ ప్రహరీని కూల్చేసిన అధికారులు మళ్లీ ఇంటిముందు ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే:అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. శనివారం అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల అర్ధరాత్రి నుంచే.. విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్నపాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. అలాగే.. అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లే రెండు మార్గాలనూ పోలీసులు మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసుల బలగాలు మోహరించారు.