YSRCP Ministers : ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రపై ఎదురుదాడిని పెంచేందుకు అధికార వైకాపా రాజీనామాఎత్తుగడలకు తెరతీసింది. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి తాను మంత్రి పదవి నుంచి వైదొగలడానికి సిద్ధంగా ఉన్నానంటూ విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. "విశాఖ రాజధాని సాధన ఉద్యమంలో మరింత చురుకుగా పాల్గొనడానికి మంత్రి పదవి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నా. వికేంద్రీకరణ సూత్రంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ ఆలోచనలకు మద్దతునిస్తూ, మీ చేతుల్ని మరింత శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉంది" అంటూ.. ధర్మాన సీఎంతో చెప్పినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు లీకులిచ్చింది.
అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి దాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయమై వైకాపాలో ముఖ్యనేతలు, ముఖ్యమంత్రి జగన్ వద్ద నిర్వహించిన సమావేశాల్లో కీలకంగా వ్యవహరించిన ధర్మాన, ఇప్పుడు రాజీనామాకు సిద్ధం అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం ధర్మాన లాంటి సీనియర్ మంత్రి.. పదవికి రాజీనామా చేస్తున్నారంటే అది చర్చనీయాంశంగా మారుతుందనే అంచనాతో, అధికార పక్షం ఈ వ్యూహానికి తెరతీసిందా అన్న ప్రచారం జరుగుతోంది.
అమరావతి పాదయాత్రకు పోటీగా శ్రీకాకుళం, విజయనగరం నుంచి మంత్రుల నేతృత్వంలో పాదయాత్రలు చేపట్టే ప్రతిపాదనను వైకాపా అధినాయకత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. అమరావతి యాత్ర ప్రకటించినప్పటి నుంచి దీనిపై ఎలా ప్రతిస్పందించాలి, ఎలా ఎదురుదాడి చేయాలి అనే అంశాలపై..సీనియర్ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, అనకాపల్లి జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్, కాకినాడ జిల్లాకు చెందిన మంత్రి దాడిశెట్టి రాజా తదితరులు ,ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో సమావేశమై చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ చర్చల్లో వచ్చిన పలు ప్రతిపాదనలను అమలు చేయబోతున్నారని సమాచారం.
విశాఖను రాజధాని చేయకుండా అడ్డుకునేందుకే అమరావతి యాత్రన్న తమ వాదనను ఉత్తరాంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా.. రాజకీయేతర ఐకాస ఏర్పాటు చేసి, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచే అమరావతి పాదయాత్రకు పోటీగా యాత్రలు, సభలు నిర్వహిస్తూ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిని మరింత తీవ్రతరం చేసే కార్యాచరణ అమలుకు సిద్ధమవుతున్నట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు మంత్రులు కూడా మాటల దాడిని పెంచారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి జగన్‌తో శుక్రవారం అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో పలు అసైన్డ్ భూములకు నిరభ్యంతర పత్రాలు ఇప్పించి ఆ భూములను తన కుటుంబసభ్యులపరం చేసుకున్నట్లుగా 2017లో ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. సిట్ నివేదిక వివరాలు ఇటీవల వార్తల్లోకొచ్చాయి. ఈ నేపథ్యంలో ధర్మాన ఆ విషయంపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారన్న చర్చ వైకాపా వర్గాల్లో జరుగుతోంది. దీనిపై అధికారికంగా స్పష్టత రాలేదు.
మూడు రాజధానులపై జగన్నాటకం ఇవీ చదవండ: