విశాఖ జిల్లా కోనాం మధ్య తరహా జలాశయం పరిధిలో సాగునీటి కాలువలు గడ్డి, చెత్తతో పూడిపోయాయి. ఖరీఫ్ సాగు సమయం దగ్గర పడుతుండటంతో పూడికతీత పనులకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కాలువలను నీటి పారుదలకు అనువుగా మార్చుతున్నారు.
తొలుత ఎగువ కాలువలో చీడికాడ సమీపంలో మూడు కిలోమీటర్ల మేర పూడిక తీసేందుకు పనులు ప్రారంభించారు. రూ.3.67 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కూలీలకు 1,442 పని దినాలు కల్పిస్తున్నట్లు పథకం ఏపీఓ నాగరాజు చెప్పారు. రోజూ 200 మంది వరకు కూలీలు పనుల్లో పాల్గొంటున్నారన్నారు. జలాశయం పరిధిలో కాలువలన్నింటిలో ఖరీఫ్ సాగు నీటి విడుదలకు ముందుగానే పూడిక తీయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.