ఇవాళ విశాఖలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఓ ముఠా గుట్టుగా రెమిడెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరకు అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్నారు. తమ బంధువులకు కోవిడ్ చికిత్స నిమిత్తం రెమిడెసివిర్ ఇంజక్షన్లు కావాలంటూ ముఠాలోని రాకేష్ అనే వ్యక్తిని సంప్రదించారు. తన వద్ద ఆరు రెమిడెసివర్ ఇంజెక్షన్లు ఉన్నాయని వాటి ధర ఒక్కొక్కటి రూ .35,000 (6 వైల్స్.. రూ .2,10,000) అని ఫోన్లో తెలిపాడు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు సునీతా, కల్యాణి లు ఎంవీపీ కాలనీలోని ఒక ఆసుపత్రి పరిసరాల్లో వేచి ఉండగా.. నిందితులు రాకేష్, జీ.బ్రహ్మాజీ లు అక్కడికి వచ్చారు.
వారివద్ద మూడు కోవిఫోర్ ఇంజక్షన్లు (హెటెరో), మూడు రెడిక్స్-ఎల్ ఇంజెక్షన్లు (డాక్టర్. రెడ్డీస్)తో పాటు.. రూ .44,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు, విజిలెన్స్ అధికారులు నిందితులను పట్టుకుని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీరికి ఓ వైద్యుడి ద్వారా ఈ ఇంజక్షన్లు వస్తున్నట్లు వారు తెలపడంతో.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.