Ramoji Film City won the Hospitality Award దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య సేవల పురస్కారం రామోజీ ఫిల్మ్ సిటీకి దక్కింది. పర్యాటక, ఆతిథ్య రంగాల ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు దక్షిణ భారత హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ (సిహ్రా) ప్రకటించింది. బెంగళూరులోని షాంగ్రిలా హోటల్‌లో శుక్రవారం నిర్వహించే సమాఖ్య వార్షిక సమ్మేళనంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొని.. రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ సీహెచ్ విజయేశ్వరికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
విశాఖపట్నంలోని నోవోటెల్‌తోపాటు దక్షిణాదికి చెందిన 19 హోటళ్లు, రిసార్ట్‌లకు వివిధ విభాగాల్లో పురస్కారాలను అందిస్తామని నిర్వాహక సంఘం అధ్యక్షుడు కె.శ్యామరాజు వెల్లడించారు. ఈ సమ్మేళన ప్రారంభోత్సవానికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి ఆనంద్‌సింగ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మంత్రులు హాజరవుతారని చెప్పారు.