విశాఖ శారదా పీఠం సరస్వతీ దేవి నామస్మరణతో మార్మోగింది. మూలా నక్షత్రం సందర్భంగా పీఠం ప్రాంగణంలో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థుల కోసం పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు చేపట్టారు. రాజశ్యామల అమ్మవారు బుధవారం మహా సరస్వతి అవతారంలో దర్శనమిచ్చారు. చేతిలో వీణతో నెమలి వాహనంపై ఆసీనులై భక్తులను అనుగ్రహించారు.
రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి పాదాల చెంత ప్రతిష్టించిన శ్రీచక్రానికి నిర్విరామంగా ఏడు గంటలపాటు నవావరణ అర్చన చేశారు. అభిషేక సమయంలో రాజశ్యామల అమ్మవారు నిజరూపంలో దర్శనమిచ్చారు. లోక కల్యాణార్థం విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన చండీయాగం, శ్రీమత్ దేవీ భాగవత పారాయణ మహాయజ్ఞం కొనసాగుతున్నాయి.