విశాఖ నగరంలో అడుగుపెట్టగానే ఎవరికైనా మొదట కనిపించేది ఓ వైపు పచ్చని కొండలు... మరోవైపు నీలి సాగర తీరం. తూర్పు కనుమల ఆకర్షణ ప్రకృతి వరంగా ఉన్నా... నగరంలో ఏటా కనిపిస్తున్న నీటి ఎద్దడి సమస్య తీవ్రమవుతూనే ఉంది. ఆ దిశగా నగర వాసుల్లో పర్యావరణ స్పృహ పెరగాల్సిన ఆవశ్యకతపై ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా సింహాచలం దేవస్థానం చేపట్టిన వాననీటి సంరక్షణ చర్యలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జల వనరుల శాఖ ప్రతిష్టాత్మకంగా అందించే జల అవార్డుల జాబితాలో ఉత్తమ జల సంరక్షణ విధానాలు అవలంభించిన ధార్మిక సంస్థగా సింహాచలం దేవస్థానం నిలిచింది.
ప్రతి నీటిబొట్టును ఒడిసి పడుతూ...
సాధారణంగా కొండలపై వాన కురుస్తోందంటే ఆ నీరంతా పల్లానికి పారుతూ పోతుంది. విశాఖలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత వర్షం కురిసినా ఆ నీరంతా సముద్రం పాలు కావాల్సిందే అన్నట్లు నగరంలో పరిస్థితి ఉంటోంది. ఈ సమస్యపై దృష్టి సారించిన సింహాచలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు 6 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సింహాచలం కొండపై సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నీటి సంరక్షణకు శ్రీకారం చుట్టింది. వర్షపు నీటిని ఒడిసి పట్టేలా కొండపైనా, కింద కాలువలు తవ్వారు. ఆ నీరంతా నాలుగు బావుల్లోకి చేరేలా చేశారు. అత్యంత శాస్త్రీయంగా ఇంజక్షన్ బావుల్ని ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేసే మార్గాన్ని చూపారు.