ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉండే విశాఖనగరం.. రైల్వేపరంగా అతి ముఖ్యమైన కేంద్రం. వాల్తేరు డివిజన్‌గా రైల్వేలో అత్యంత ప్రముఖ స్ధానాన్ని పదిలం చేసుకున్న ఈ రైల్వే డివిజన్ కు 125 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మైలురాయిని దాటిన డివిజన్లలో వాల్తేరుదే అగ్రస్ధానం. కోల్‌కతా-చెన్నై మార్గాన్ని అనుసంధానిస్తూ భారతీయ రైల్వే చరిత్రలో సుస్ధిర స్ధానం సంపాదించింది. అయితే ఎంతోకాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్ కలను సాకారం చేస్తూ.. కేంద్రం సాధారణ ఎన్నికలకు ముందే నిర్ణయం వెలువరించింది. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత... తూర్పు కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటించిన కేంద్రం.. ప్రధాన కార్యాలయం విశాఖలో ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చింది.
సుదీర్ఘ చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంపై ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కానీ.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. ఇవేమీ పట్టించుకోని అధికారులు... జోన్ ఏర్పాటు ప్రక్రియల్లో భౌగోళిక సరిహద్దులు, ఇతర విధివిధానాలు ఖరారు చేసే పనిలో పడ్డారు.