ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాకవరపాలెంలో మాయాజాలం... క్వారీ లేకుండానే రూ. కోట్ల ఆర్జన

ఏదైనా సాధ్యమే.. అవును! మైనింగ్‌లో ఎలాంటి అక్రమమైనా సాధ్యమే. కొండలను కొల్లగొట్టడం చూశాం.. తవ్వకాల్లో తిమ్మిని బమ్మి చేయడమూ విన్నాం.. తట్ట మట్టి తీయకుండా... అసలు క్వారీయే లేకుండా కోట్లు ఆర్జించడం సాధ్యమేనా? అక్రమార్కులు తల్చుకోవాలి.. అధికారులు సహకరించాలి కానీ ఏదైనా సాధ్యమే. సాక్షాత్తు మైనింగ్‌ విజిలెన్స్‌ ఉన్నతాధికారుల విచారణలో తేలిన అంశమిది

quarry scam at makavaram vishaka district
quarry scam at makavaram vishaka district

By

Published : Oct 8, 2020, 11:01 AM IST

క్కడైనా క్వారీ కోసం కొండను లీజుకు తీసుకుంటే దాన్ని తవ్వి రాయి, పిక్క తయారుచేసి వ్యాపారం చేస్తారు. కొంతమంది అనుమతులు తీసుకున్న విస్తీర్ణం మించి తవ్వకాలు చేసి అక్రమాలకు పాల్పడతారు. కాని విశాఖ జిల్లా మాకవరపాలెంలో కొండ కొండగానే ఉంచి రూ. కోట్లు కొల్లగొట్టారు. మాకవరపాలెంలోని సర్వేనెంబరు 30లో ఐదు హెక్టార్లలో క్వారీ తవ్వకానికి ఎస్‌.చిన్నమ్మలు పేరుతో పదేళ్ల క్రితం లీజుకు తీసుకున్నారు. క్వారీల్లో అనుమతులకు మించి తవ్వకాలు చేస్తున్నారంటూ మైనింగ్‌ శాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి ఇటీవల పలు ఫిర్యాదులు అందాయి.

జిల్లావ్యాప్తంగా రెండురోజులుగా చేస్తున్న తనిఖీల్లో భాగంగా బుధవారం మాకవరపాలెం క్వారీలోనూ భారీగా తవ్వకాలు జరుగుతున్నాయని అక్కడకు వెళ్తే విస్తుపోవడం అధికారుల వంతయింది. పదేళ్లగా మాకవరపాలెంలోని క్వారీలో ఎలాంటి తవ్వకాలు చేయలేదు. ఇక్కడ తవ్వకాలకు ఇచ్చిన పర్మిట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వారికి అమ్మేసుకున్నారు. ఈ క్వారీ పేరుతో మొత్తం 33,500 క్యూబిక్‌ మీటర్ల పర్మిట్లు ఇతరులకు అమ్మినట్లు నిగ్గుతేల్చారు. మాకవరపాలెంలో క్వారీ లీజుకు తీసుకున్న చిన్నమ్మలుకు బంధువైన అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన వ్యక్తి ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు అధికారులు గుర్తించారు. ఇతడు ఇంతకుముందు మైనింగ్‌ వ్యవహారాల్లో పలు అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. పర్మిట్లు ఇతరులకు అధిక ధరలకు అమ్మిన నేరంపై విజిలెన్స్‌ అధికారులు క్వారీ నిర్వాహకులకు రూ. 1.50 కోట్లు జరిమానా విధించినట్లు తెలిసింది.

మార్టూరులోని రెండు క్వారీల్లో తనిఖీలు

అనకాపల్లి మండలంలోని మార్టూరులో రాక్‌లైన్‌కి చెందిన రెండు క్వారీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి అధికారులతో తనిఖీలు చేపట్టారు. రెండురోజులుగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్వారీల్లో తవ్వవకాలకు అనుమతులు ఎంతవరకు తీసుకున్నారు? ఎంతవరకు తవ్వారు అన్నదాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తామని ఏడీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అనకాపల్లి మైన్స్‌ కార్యాలయంలో పరిధిలో 23 క్వారీలపై ఫిర్యాదులు వచ్చాయని, వీటన్నింటిలోనూ తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల జలవివాదం: క్రియాశీలకం కానున్న కృష్ణాబోర్డు

ABOUT THE AUTHOR

...view details