విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కుకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం రాజయ్యపేటలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అందులో పాల్గొన్న ప్రజలంతా పార్క్ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ‘3,899 ఎకరాల పచ్చని పొలాలను పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టి పెట్రో, రసాయన పరిశ్రమలను తెచ్చి మా ప్రాణాలను తీయాలని చూస్తున్నారా? ఇప్పటికే హెటిరో వంటి ప్రమాదకర పరిశ్రమను మా నెత్తిన పెట్టారు. ఇప్పుడు మరికొన్ని అలాంటి పరిశ్రమలనే తేవడం వెనుక ఉద్దేశమేంటి’ అని అధికారులను నిలదీశారు.
'ప్రాణాలు తీసే.. పారిశ్రామిక పార్కులు మాకొద్దు' - public protest about industrial park at nakkapally mandal in visakhapatnam district
నక్కపల్లి పారిశ్రామిక పార్కును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణాలు తీసే పారిశ్రామిక పార్కులు వద్దే వద్దంటూ.. ప్రజాభిప్రాయ సేకరణ సభలో స్పష్టం చేశారు. పచ్చని పొలాలను పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టాలని చూస్తున్నారా.. అని ఉన్నతాధికారులను ప్రశ్నించారు.

పొలాలపై రసాయనాలు పిచికారి చేయొద్దని చెబుతున్న అధికారులే ప్రమాదకర రసాయన పరిశ్రమలను జనావాసాల మధ్యకు తేవడం సమంజసమా అని డీఎల్ పురానికి చెందిన అవతారం రాజు నిలదీశారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే పరిశ్రమలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని వామపక్ష నేతలు హెచ్చరించారు. తీసుకున్న భూములకు పూర్తిగా పరిహారం చెల్లించకుండా ఏ పరిశ్రమలను నెలకొల్పుతారన్నది చెప్పకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తప్పుపట్టారు.
ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకుంటానని.. పరిహారం, ఇతర సమస్యలను పరిష్కరించిన తరవాతే అధికారులు ముందుకు వెళ్లేలా చూస్తామన్నారు. వ్యక్తిగతంగా రసాయన పరిశ్రమలకు తానూ వ్యతిరేకినేనని ప్రకటించారు. ప్రజాభిప్రాయ వేదికపై లేవనెత్తిన ప్రతి సమస్యను, సూచనలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని జేసీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నర్సీపట్నం సబ్‌కలెక్టర్ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుభాన్ షేక్ తదితరులు పాల్గొన్నారు.