ఆంధ్రా-ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ను కలుపుతూ ఉండే ఘాట్ రోడ్... ప్రస్తుతం దోపిడీ దొంగల భయంతో వణుకుతోంది. ఆ దారి గుండా ప్రయాణం చేయాలంటే వాహనదారులు హడలిపోతున్నారు. విశాఖ జిల్లా సీలేరు నుంచి గూడెంకొత్తవీధి వరకు 49 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల.. ప్రయాణం చేయాలంటే సాహసించాల్సిందే. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఎక్కువగా ఉండటం వల్ల.. అంతగా ఎవరూ ప్రయాణించేవారు కాదు. కాలక్రమేణా వాటి సంచారం తగ్గడంతో రాకపోకలు పెరిగాయి.
దారి దోపిడీ దొంగలు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. వాహనాలను అడ్డగించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నెలలోనే నాలుగైదు పర్యాటక వాహనాలపై దాడి చేసి.. వారి నుంచి నగదు, బంగారం కాజేశారు.