Agitation for Visakha Steel: ఉక్కు ఉద్యమ కార్యాచరణ సమితి పిలుపు మేరకు.. విశాఖ కూర్మన్నపాలెం, అగనంపూడి ప్రధాన రహదారులు, మండల కేంద్రాల్లో కార్మికులు, ఐఎన్టీయూసీ వామపక్షాలు రాస్తారోకో నిర్వహిస్తున్నాయి. ప్రధాని మోడీ.. అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి . అలాగే ప్రాణత్యాగాలతో సాధించి, నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. కూర్మన్నపాలెం జాతీయ రహదారిని ఉక్కుపోరాట కమిటి దిగ్బంధించటంతో.. పోలీసులు పోరాట కమిటీ నాయకులు రామచంద్రరావు, ఆదినారాయణ, అయోధ్యరామ్లను అరెస్టు చేశారు.
గాజువాకలో నిరసన: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. గాజువాకలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రాస్తారోకోకు టీడీపీ, వైసీపీ, వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ప్రాణత్యాగాలతో సాధించి నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూస్తే ఊరుకోమని వామపక్ష నాయకులు హెచ్చరించారు. నిరసన తెలుపుతున్న పల్లా శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు నర్సింగరావు తదితర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
విజయవాడలో ఆందోళన:విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విజయవాడలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంజీ రోడ్డు నుంచి వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం వద్ద వామపక్ష, కార్మిక, రైతు సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు.. ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
గుంటూరులో రాస్తారోకో :ఉక్కు పరిరక్షణ వేదిక పిలుపులో మేరకు గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ వద్ద వామపక్ష పార్టీ నేతలు, కార్మిక సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకులను ఆరండల్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.