విశాఖ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు నగర పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని నగర పోలీసు కమిషనర్ నేరుగా పర్యవేక్షించేవారు. కొత్త సీపీగా బాధ్యతలు స్వీకరించిన మనీష్‌కుమార్ సిన్హా ఈ విభాగ పర్యవేక్షణను డీసీపీ-1కు అప్పగించారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌లో ఏసీపీ-1, 3 ఎస్‌ఐలతో పాటు మొత్తం 34 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. కమిషనరేట్‌లోని 23 పోలీసుస్టేషన్లలో పరిధిలోని కార్యకలాపాలు చూసేవారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని స్టేషన్లను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరని అధికారులు తెలిపారు.
విశాఖ పరిపాలన రాజధానిగా మారితే టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేయటం ద్వారా చాలావరకు అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టవచ్చని కమిటీ ద్వారా ప్రతిపాదనలు చేశారు. నగర పరిధిలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్లతో పాటు అదనంగా ఏర్పాటు చేయాలనుకున్న 3వ జోన్ పరిధిలో కూడా టాస్క్‌ఫోర్స్ స్టేషన్లు ఉంటే మంచిదని భావిస్తున్నారు. దీనికి ఒక ఏసీడీపీని నియమించి, అన్ని జోన్లలో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ను పర్యవేక్షించటం ద్వారా పరిపాలన సులభతరంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే మూడు జోన్ల పరిధిలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌కు ఒక్కో ఏసీపీతో పాటు సీఐలను కూడా నియమించాలని ప్రతిపాదించారు.