ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో.. విశాఖలోని థాంప్సన్ వీధిలో ఉండే సాయి ఈశ్వర్ ప్రియాంకపై ఆమె ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ అనే యువకుడు 2020 డిసెంబరు రెండో తేదీన దాడి చేశాడు. హెక్సాబ్లేడుతో ప్రియాంక గొంతుపై నాలుగు చోట్ల బలంగా కోసేయడంతో నెల రోజులపాటు మృత్యువుతో పోరాడింది. అయితే.. ప్రాణాలు దక్కినప్పటికీ గొంతు మాత్రం మూగబోయింది. ముంబయిలోని ప్రిన్స్ అలీఖాన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తే.. మళ్లీ మాటలు వస్తాయని తెలిసి ప్రియాంక తల్లిదండ్రులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ సాయంతో అక్కడికి తీసుకెళ్లారు.
శస్త్రచికిత్స, ఇతర ఖర్చులకు 11 లక్షల అవుతుందని తెలిసి సాయం కోసం అధికారుల్ని వేడుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత బిల్లు పెట్టుకోవాలని వారు సూచించారు. ఎమ్మెల్యే వాసుపల్లి లక్ష సాయం చేయగా.. మిగిలిన మొత్తం కోసం సామాజిక మాధ్యమాల్లో తమ పరిస్థితిని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. క్రికెటర్ హనుమ విహారి స్పందించి 5 లక్షలు అందించారు. మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకుని ఈ ఏడాది జూన్ 21వ తేదీన శస్త్రచికిత్స చేయించారు. ప్రియాంక ప్రస్తుతం ఒకింత మాట్లాడగలుగుతోంది. కానీ.. తలను మాత్రం ఎప్పుడూ వంచే ఉంచాల్సిన దుస్థితి.