విశాఖ జిల్లాలో హస్తకళలకు పేరొందిన ఏటికొప్పాక పేరు మరోమారు జాతీయస్థాయిలో వినిపించింది. ‘మన్ కీబాత్’లో ప్రధాని మోదీ ఏటికొప్పాక బొమ్మల ఘనతను ప్రస్తావించారు . 300 సంవత్సరాల కిందటే ఏటికొప్పాక గ్రామంలో ఈ లక్కబొమ్మల తయారీ మొదలైంది. అప్పట్లో వీటిని రాజకుటుంబీకులు మాత్రమే వాడేవారు. దాంతో ఇవి బయట ప్రపంచానికి తెలిసేవి కావు. పెళ్లికుమార్తెకు అలంకరణ పెట్టెలు, కుంకుమభరిణెలు, కుంచాలు, తవ్వలు, రాజకుటుంబీకుల పిల్లలు ఆడుకోవడానికి చిన్నచిన్న బొమ్మలు వీరు తయారుచేసేవారు. రాజరిక వ్యవస్థ పోయిన తర్వాత కళాకారులు వీటిని తిరునాళ్లలో అమ్మేవారు. కాలానుగుణంగా కళాకారులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ బొమ్మలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చారు. ఎలాంటి అంచులు లేకుండా గుండ్రంగా ఉండటం, బొమ్మల తయారీలో రసాయనాలు వాడకపోవడంతో వీటి వల్ల చిన్నారులకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు.
విశాఖ కళాకారుడు సీవీ రాజుకు ప్రత్యేక ప్రశంస
బొమ్మల తయారీలో భారత్ ప్రపంచ హబ్‌గా అవతరించాలి. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రూ.7 లక్షల కోట్ల మార్కెట్‌ను మనం అందిపుచ్చుకోవాలి. విభిన్న బొమ్మల తయారీ శక్తి ఉండి కూడా భారత్ రాణించలేకపోవడం విచారకరం. అయితే దేశంలో కొన్ని ప్రాంతాలు బొమ్మల తయారీ క్లస్టర్లుగా వృద్ధి చెందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లి, కర్ణాటకలోని చన్నపట్న, తమిళనాడులోని తంజావూరు, అసోంలోని దుబారి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాశి ప్రాంతాలు ఇందుకు ఉదాహరణలు. విశాఖపట్నంలో ఏటికొప్పాక బొమ్మల కళాకారుడు సీవీ రాజు ఉన్నారు. ఆ బొమ్మలకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది. కలపతో తయారుకావడం ఈ బొమ్మల ప్రత్యేకత. వాటిలో పదునైన కోణాలు ఉండవు. ఎటుచూసినా గుండ్రంగా ఉంటాయి. వాటితో పిల్లలకు దెబ్బలు తగిలే అవకాశం ఉండదు. ఇప్పుడు రాజు తమ గ్రామ కళాకారులతో కలిసి ఏటికొప్పాక బొమ్మల తయారీలో ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అద్భుతమైన నాణ్యతతో వాటిని రూపొందిస్తూ ఆ బొమ్మలకు పునర్‌వైభవాన్ని తెచ్చారు. స్థానిక బొమ్మలను ప్రోత్సహించడానికి ఇదే మంచి తరుణం. అంకుర పరిశ్రమలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వీటిని దేశంలో తయారుచేయడానికి నడుం బిగించాలి.
-ప్రధాని
కళకు కొత్త వెలుగులిలా..
బొమ్మల విక్రయంలో చైనా నుంచి పోటీ పెరిగాక లక్కబొమ్మలకు ఆదరణ తగ్గింది. ముడిసరకైన అంకుడుకర్ర దొరక్క, తయారు చేసిన బొమ్మలకు గిట్టుబాటు ధర లభించక కళాకారులు ఈ వృత్తిని విడిచి కూలి పనులకు పోవడం ప్రారంభించారు. దీంతో గ్రామానికి చెందిన చింతలపాటి వెంకటపతిరాజు అంతరించిపోతున్న ఈ కళను బతికించడానికి శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాలు తిరిగి అధ్యయనం చేశారు. యువ కళాకారులకు ఆధునిక పద్ధతిలో బొమ్మల తయారీని నేర్పించారు. బొమ్మలకు రసాయన రంగులేస్తే విదేశాల్లో ఆదరణ ఉండదని తెలుసుకుని స్థానికంగా లభించే చెట్ల గింజలతో ప్రకృతిసిద్ధమైన రంగులు తయారు చేసి, వీటిని లక్కలో కలిపి బొమ్మలకు అద్దడం ప్రారంభించారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2002లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా జాతీయస్థాయి అవార్డు అందించింది.
హస్తకళ కలకాలం బతకాలి.. ప్రకృతి సిద్ధమైన రంగులు లక్కబొమ్మలకే కాదు.. వస్త్రాలకు, గృహోపకరణాలకు ఇలా అన్నింటా వాడుకోవచ్చు. అంకుడు కర్ర అందుబాటులో ఉంటే ఏటికొప్పాక కళాకారులు మరిన్ని అద్భుతమైన బొమ్మలను తయారుచేస్తారు. ఈ హస్తకళ చిరకాలం బతికుండేలా చేయాలన్నదే నా ఆశయం.
- చింతలపాటి వెంకటపతిరాజు, ఏటికొప్పాక
మనసు దోచే కొండపల్లి
అష్ట వంకర్లున్న తెల్ల పొనికికి బొమ్మ రూపంలో సజీవకళ ఉట్టి పడిందంటే ముమ్మాటికీ అది కొండపల్లి బొమ్మే. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కొయ్యబొమ్మల కళ అప్పటి కళాకారులైన రాజుల నేతృత్వంలో కొండపల్లికి వచ్చింది. కాలక్రమేణ ఊరిపేరునే తన పేరుగా మార్చుకొని కొండపల్లి కొయ్యబొమ్మగా మారింది. దివంగత నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్‌లకు కొండపల్లి బొమ్మలను పలువురు బహూకరించారు. ఏనుగు అంబారీ, కొబ్బరి చెట్టు, డాన్సింగ్ డాల్, పెళ్లి పల్లకి, గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే ఎడ్లబండి, వివిధ రకాల పక్షులు, హిందూ దేవతామూర్తుల బొమ్మలు వీటిలో ఉంటాయి. గతంలో వంద కుటుంబాలకు చెందినవారు దీనిపై ఆధారపడ్డారు. మార్కెటింగ్ సౌకర్యంతో 2010 - 2014 మధ్య దేశంలో అనేక ప్రాంతాలకు కొండపల్లి బొమ్మ విస్తరించింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కొండపల్లి బొమ్మకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంతో పాటు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించాయి. కళాకారుల కుటుంబాల్లోని యువతరం ఈ కళకు దూరంగానే ఉండాలని భావిస్తూ సాంకేతిక చదువులు, ఇతర వృత్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ తరం తర్వాత ఈ కళ ప్రశ్నార్థకమేనని నేటితరం కళాకారులు వాపోతున్నారు.
ఇదీ చూడండి.ఉద్యమ స్ఫూర్తితో మాతృభాషా పరిరక్షణ