ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ కార్యక్రమమైతే చాలు.. డ్వాక్రా మహిళలకు కష్టాలే - వైసీపీ నేతల బెదిరింపులు

Pressure Of YCP Leaders On Dwakra Women: స్వయం ఉపాధిలో ఏళ్లుగా దేశానికి ఆదర్శంగా నిలిచిన.. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలు.. ఇప్పుడు అధికార పార్టీ సభలకు ప్రధాన వీక్షకులుగా మారుతున్నారు. ఆ సభతో ఎలాంటి సంబంధం లేకున్నా సరే.. వారు తప్పనిసరిగా రావాల్సిందే. లేదంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తారు. రుణాలు రాకుండా చేస్తామని హెచ్చరిస్తారు. మహిళలను తీసుకురాని అధికారులకు.. లక్ష్యాన్ని చేరుకోలేదని వేధిస్తారు. ఇలాంటి నేపథ్యంలో అధికార పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలంటేనే.. డ్వాక్రా మహిళలు, సంబంధిత అధికారులు.. బెంబేలెత్తిపోతున్నారు.

Dwakra Women
డ్వాక్రా మహిళలు

By

Published : Dec 15, 2022, 7:11 AM IST

Updated : Dec 15, 2022, 8:59 AM IST

Pressure Of YCP Leaders On Dwakra Women: ఒక్కో పొదుపు సంఘంలో కనీసం 10 మంది సభ్యుల చొప్పున రాష్ట్రంలో కోటిమంది వరకు డ్వాక్రా మహిళలున్నారు. ఏళ్లుగా పొదుపు నిర్వహణలో, జీవనోపాధి కార్యక్రమాల్లో దేశానికే తలమానికంగా ఉన్నారు. ఇప్పుడు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరికి ఎన్నడూ లేని పెద్ద కష్టం వచ్చిపడింది. ఎన్ని పనులున్నా ప్రభుత్వం, వైసీపీ నిర్వహిస్తున్న సభలు, సమావేశాలకు హాజరు కావాల్సిందే. లేకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని అధికారులు డ్వాక్రా మహిళలకు హుకుం జారీ చేస్తుండటంతో హడలిపోతున్నారు. అధికార పార్టీ నిర్వహించే ర్యాలీలు, మూడు రాజధానుల పేరుతో చేపట్టే గర్జనలు, ప్లీనరీ వంటి పార్టీపరమైన సభలకూ హాజరు తప్పనిసరని బెదిరిస్తున్నారు.

ప్రభుత్వ కార్యక్రమమైతే చాలు.. డ్వాక్రా మహిళలకు కష్టాలే

ప్రభుత్వ కార్యక్రమమైతే డ్వాక్రా మహిళలపై అధికారులు ఒత్తిడి చేస్తుండగా.. పార్టీ సభలైతే వాలంటీర్లు, స్థానిక వైసీపీ నాయకులు ఆజమాయిషీ చేస్తున్నారు. సభకు హాజరు కాకపోతే సంక్షేమ పథకాలు కోత కోస్తామని, సున్నా వడ్డీ రాయితీ, ఆసరా, చేయూత, తదితర పథకాలను అందబోవని బెదిరిస్తున్నారు. గతంలోనూ ప్రభుత్వ కార్యక్రమాలకు డ్వాక్రా మహిళల్ని తరలించడం ఉన్నా ఇంతస్థాయిలో బెదిరింపులు ఎప్పుడూ లేవు. దీంతో తప్పనిసరై ఎన్ని పనులున్నా వదిలేసి ఆయా సభలకు, కార్యక్రమాలకు వారు హాజరవుతున్నారు.

కర్నూలులో ఇటీవల వైసీపీ నిర్వహించిన రాయలసీమ గర్జనకు పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళల్ని ఆ పార్టీ నేతలు సమీకరించారు. ప్రతి సంఘం నుంచి ఐదుగురైనా హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. సభకు రాని సంఘాలకు 100 జరిమానా ఉంటుందని సెల్‌ఫోన్‌లో సందేశం పంపారు. విశాఖలో నిర్వహించిన గర్జన సభకూ తప్పనిసరిగా హాజరు కావాలని డ్వాక్రా మహిళలకు ఆదేశాలు అందాయి. విశాఖలో ప్రధాని మోదీ నిర్వహించిన బహిరంగసభకు వైసీపీ ప్రభుత్వమే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసింది. ఇందులోనూ డ్వాక్రా మహిళల్నే ప్రధాన భాగస్వామ్యం చేయాలని నిర్ణయించి.. ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేశారు. భీమిలి మండలంలో నీరు నిలిపేసి డ్వాక్రా మహిళల్ని బస్సుల్లో తరలించారని అక్కడి వీవోఏలు చెబుతున్నారు.

ఏ గ్రామం తీసుకున్నా కనీసం 100 నుంచి 200 వరకు డ్వాక్రా మహిళలు ఉండటంతో.. ప్రభుత్వం, వైసీపీ.. తరచుగా నిర్వహించే సభల్ని విజయవంతమయ్యాయని ప్రజలకు చూపించేందుకు వీరినే ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నాయి. ప్రతి సంఘం నుంచి ఇద్దరా? ముగ్గురా?అనేది వీవోఏ-ఆర్పీలకు ముందుగానే నిర్దేశిస్తారు. ఆ ప్రకారం ఒక్కో మండలానికి ఎన్ని బస్సులు కేటాయించేది ఉన్నతాధికారులు ముందే సమాచారమిస్తారు. ఆ బస్సులు నిండేలా మహిళల్ని సేకరించాల్సిందేనని.. ఖళీగా ఉంటే ఒప్పుకోబోమని స్పష్టంచేస్తున్నారు. మహిళలు వెళ్లలేని పరిస్థితి ఉంటే వారి భర్తనైనా పంపాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. బస్సులు గ్రామాల నుంచి బయలుదేరేటప్పుడే సభ్యుల హాజరు సేకరిస్తున్నారు. సభకు రాలేమన్నా కుదరదని స్పష్టం చేస్తున్నారు.

కొన్నిచోట్ల అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. సాధారణంగా వీవోఏలు, ఆర్పీలకు డ్రస్‌ కోడ్‌ ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు అదే డ్రస్‌లో హాజరుకావాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నట్లు వీవోఏలు, ఆర్పీలు చెబుతున్నారు. కానీ ఎక్కువ జనం వచ్చారని చూపించేందుకు డ్రస్‌ కోడ్‌ లేకుండా గడప గడపకూ కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి హాజరు కావాలని వీరిని ఆదేశిస్తున్నారు. ఏదైనా ఒక గ్రామంలో కార్యక్రమమున్నా మండలంలోని ఇతర గ్రామాలకు చెందిన వీవోఏలు అక్కడి రావాలని చెబుతున్నారని వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో జరిగనట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ కార్యక్రమాలు, వైసీపీ నిర్వహించే సభలకు దగ్గరుండి మరీ డ్వాక్రా మహిళల్ని సమీకరిస్తున్న అధికారులు, ఆ పార్టీ నేతలు.. ప్రతిపక్షాల సభలు, ర్యాలీలు ఏర్పాటు చేస్తే మాత్రం వారు వెళ్లకుండా ఎక్కడ లేని ఆంక్షలు పెడుతున్నారు. మహిళల ప్రాథమిక హక్కుకు కూడా భంగం కలిగిస్తున్నారు. ప్రతిపక్షాలు సభ ఏర్పాటు చేసే రోజు.. ఇళ్ల దగ్గర ఉండకుండా ఏదో ఒక సమావేశం పేరుతో కార్యాలయాలకు రప్పిస్తున్నారని వీవోఏలు చెబుతున్నారు. అదే ఎమ్మెల్యే, మంత్రి సమావేశాన్ని పెట్టారంటే మాత్రం జనసమీకరణ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు.

‘ఇదేం కర్మ రాష్ట్రానికి?’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల టీడీపీ నేత చంద్రబాబు బాపట్లలో నిర్వహించిన సభకు డ్వాక్రా మహిళలు వెళ్లకుండా అక్కడి డీఆర్‌డీఏ అధికారులు ఆంక్షలు విధించారు. సభకు వెళ్లేవారి ఫోటోలు తీయాలని, అలాంటి వారిని గుర్తించి ఇకపై ఎలాంటి రుణాలు మంజూరు చేయవద్దంటూ కర్లపాలెం మండలంలోని పలు మహిళా సంఘాల్లోని మహిళల్ని బెదిరించారు.

ఏళ్లుగా సంఘాల్లో ఉంటూ వివిధ ప్రభుత్వాలు, బ్యాంకులు అందిస్తున్న తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం, వైసీపీ నాయకులు దీన్నే ఆసరాగా తీసుకుని సంక్షేమ పథకాల బూచిని చూపిస్తూ మెడ మీద కత్తి పెట్టినట్లు వీవోఏలు-ఆర్పీల ద్వారా హుకుం జారీ చేయిస్తున్నారు. సభలో జనాలు కనిపించాలంటే పొదుపు మహిళలు ఉండాల్సిందే అనే స్థాయికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వీరిని వినియోగిస్తోంది. జిల్లాల విభజన తర్వాత ఇది మరింత ఇబ్బందిగా మారిందని మహిళలు వాపోతున్నారు.

సాధారణంగా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అందించే సాయానికి సంబంధించిన ఆసరా, సున్నా వడ్డీ రాయితీ, చేయూత, తదితర కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించినా దానిలో అర్థం ఉందని, మూడు రాజధానుల పేరుతో విశాఖ, తిరుపతి, కర్నూలులో నిర్వహించిన పార్టీపరమైన ర్యాలీలు, సభలకు కూడా హాజరవాల్సిందేనని ఒత్తిడి తేవడం ఏంటని లోలోన మథనపడుతున్నారు. పైఅధికారుల నుంచి తమపై ఒత్తిడి ఉందని, లక్ష్యాన్ని పెట్టారని, తప్పనిసరిగా హాజరవ్వాలని.. లేదంటే తమను బాధ్యతల నుంచి తొలగిస్తామని, వేతనాల బిల్లు పెట్టబోమని హెచ్చరిస్తున్నట్లు వీవోఏ-ఆర్పీలు.. మహిళల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2022, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details