Navy Day Celebrations: నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖలో డిసెంబర్ 4వ తేదీన నిర్వహించే నేవీ డే విన్యాసాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. నాలుగో తేదీన విజయవాడ నుంచి మధ్యాహ్నం 2గంటల 25 నిమిషాలకు వాయుసేనకు చెందిన విమానంలో బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. విశాఖ చేరుకున్న తర్వాత.. ఐఎన్ఎస్ డేగ వద్దకు చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం సాయంత్రం నేవీడే విన్యాసాలు నిర్వహించే ఆర్కే బీచ్‌కు చేరుకుని.. విన్యాస కార్యక్రమాలను తిలకించనున్నారు. అక్కడి నుంచి ఆమె రక్షణ దళం, జాతీయ రహదారులు, గిరిజన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. విన్యాసాల ప్రదర్శన అనంతరం ఆమె నేరుగా తిరుపతి వెళ్లనున్నారని సమాచారం.
4న నౌకాదళ విన్యాసాలు.. విశాఖ రానున్న రాష్ట్రపతి ముర్ము - Navy
Navy Day Celebrations: నేవీడే సందర్భంగా డిసెంబరు 4వ తేదిన విశాఖలో జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. నాలుగో తేదిన నిర్వహించే నేవిడే విన్యాస కార్యక్రమంలో హాజరు కానున్నారు. అంతేకాకుండా రక్షణ రంగానికి చెందిన ప్రాజెక్టులను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.
నౌకాదళ విన్యాసాలకు ఉపరాష్ట్రపతి ధన్ఖర్ హాజరుకానున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విశాఖ వేదిక కానుండటంతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నేవీడే సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు: నాలుగో తేదీన నిర్వహించే విన్యాసాల సందర్భంగా.. ఎన్టీఆర్ విగ్రహం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విన్యాసాలను వీక్షించేందుకు వచ్చే వారు మినహా మిగతావారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. వాహనాలకు నిర్దేశిత పార్కింగ్ సదుపాయలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.