వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా.. విశాఖ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గత ఏడాది కురిసిన వర్షాలతో చేపట్టిన సాగు వివరాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది అన్ని పంటలూ కలిపి 1,90,200 హెక్టార్లలో సాగు చేయాలని సన్నాహాలు చేస్తోంది. గడచిన అయిదేళ్లలో సాగు సగటు వివరాలు పరిగణలోకి తీసుకొని ప్రణాళికలు రచిస్తోంది. గతేడాది 1,75,437 హెక్టార్ల సాగు లక్ష్యంగా నిర్ణయించగా… ఈ ఏడాది అదనంగా మరో 15 వేల హెక్టార్లలో సాగు చేపట్టాలని ప్రతిపాదించింది.
ఇందులో ప్రధానంగా 58శాతం వరి, 17 శాతం చెరకు, పది శాతం రాగులు, ఇతర పంటలు 10 శాతం ఉంటాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు 38 వేల 544 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 38వేల 85 క్వింటాల వరి, 200 క్వింటాల వేరుశనగ, నువ్వులు 209 క్వింటాలు, చిరుధాన్యాలు 103 క్వింటాలు ఉన్నాయి. ఇవి కాకుండా 3,400 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేశారు. ఇందులో అన్ని రకాల విత్తనాలు పది వేల క్వింటాళ్లు ఇప్పటికే జిల్లాకు చేరాయి. విశాఖ మన్యం రైతులకు అందుబాటులో ఉండేలా ఇప్పటికే ఆయా మండలాలకు వరి విత్తనాలను పంపించారు. మైదాన ప్రాంత రైతులకు సంబంధించి జిల్లా గోదాము నుంచి రైతు భరోసా కేంద్రాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.