ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీమిలి-భోగాపురం రహదారికి ప్రాథమిక సర్వే

విశాఖ జిల్లా భీమిలి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు నిర్మించతలపెట్టిన ఆరు వరుసల రహదారి నిర్మాణానికి ముమ్మర కసరత్తు జరుగుతోంది. డీపీఆర్ తయారీ బాధ్యతలను కేఅండ్‌జే నిర్మాణ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. 20 కిలోమీటర్లలో నిర్మాణానికి రూ.1,021 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలనే అంశంపై ప్రాథమిక సర్వే సాగుతోంది.

bhimili road
భీమిలి-భోగాపురం రహదారి

By

Published : Jun 28, 2021, 9:52 AM IST

విశాఖ జిల్లా భీమిలి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానించే ఆరు వరుసల రహదారి నిర్మాణానికి ముమ్మర కసరత్తు జరుగుతోంది. సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ బాధ్యతలను కేఅండ్‌జే నిర్మాణ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. తీరప్రాంతాన్ని ఆనుకుని గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని అభివృద్ధి చేయడంతోపాటు ఆ మార్గంలో అనేక సౌకర్యాలు, పర్యాటక వసతులు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. 20 కిలోమీటర్లలో నిర్మాణానికి రూ.1,021 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికే ఉన్న రణస్థలం-ఆనందపురం జాతీయ రహదారి 16 (ఎన్‌హెచ్‌-16)కి ప్రత్యామ్నాయంగా తీరం వెంబడి ఈ రహదారి ఉంటుంది.

8 వరుసలకూ ఇబ్బంది లేకుండా..
ప్రస్తుతానికి ఆరు వరుసలుగా నిర్మిస్తున్నా.. భవిష్యత్తులో 8 వరుసలకు విస్తరించేలా భూమిని సేకరిస్తారు. అయితే ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలనే అంశంపై ప్రాథమిక సర్వే సాగుతోంది. డిజిటల్‌ సర్వేకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఎక్కువ ప్రభుత్వ భూములు, తక్కువ ప్రైవేటు భూములు ఉండే మార్గాలను పరిశీలిస్తున్నారు. మూడు, నాలుగు మార్గాలు చూసి.. వాటిలో ఒక దాన్ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మార్గానికి ఆనుకొని భీమిలి మండలం కంచరపాలెంలో వీఎంఆర్‌డీఏ (విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ)కు 500 ఎకరాలు ఉంది. సమీపంలో పర్యాటకశాఖకు చెందిన 200 ఎకరాలు ఉంది.

దాదాపు 700 ఎకరాలు
ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 570 ఎకరాలు అవసరమవుతుందని తొలుత భావించినా.. 700 ఎకరాల వరకు అవసరం ఉంటుందని సమాచారం. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. నిర్దేశించిన మార్గంలో ఆర్‌అండ్‌బీ, ఉద్యానవన, అటవీ, వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి.

అంతా ‘స్మార్ట్‌’
ఆరు వరుసల రోడ్డుకు ఇరువైపులా 2.2 మీటర్ల సైకిల్‌ మార్గాలు, 1.8 మీటర్ల నడక దారులు నిర్మించనున్నారు. రోడ్డుకు ఇరువైపులా సేద తీరేందుకు వీలుగా ఉద్యానవనాలు, మధ్యలో కొన్ని వసతులు ఉంటాయి. సెన్సర్‌ ఆధారిత ఎల్‌ఈడీ దీపాలు, సీసీటీవీ, వై-ఫై సౌకర్యం ఉంటాయి. అక్కడక్కడ బస్సులు, ఆటోలు నిలిపే స్థలాలు, సైకిల్‌ పార్కింగ్‌ స్థలాలు ఉంటాయి. ఈ బీచ్‌ కారిడార్‌లో గోస్తనీ నదిపై రెండు వేలాడే వంతెనలను కూడా నిర్మించనున్నారు.

ఇదీ చదవండి

విశాఖ.. రాజధానిగా అభివృద్ధి వైపు అడుగులు

ABOUT THE AUTHOR

...view details