విశాఖ మన్యం కేంద్రం పాడేరు జిల్లా ఆసుపత్రిలో కనీస వైద్య సేవలు అందక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్త పరీక్షలు చేయించుకోవాలన్న గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మన్యంలో సరైన రహదారులు లేకపోవటంతో ఎన్నో ప్రయాసలు పడి గర్భిణులు జిల్లా ఆసుపత్రికి చేరుకుంటారు. తీరా ఆసుపత్రికి వచ్చాక వైద్య సేవలు అందక మహిళలు అయోమయానికి గురవతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వైద్య పరీక్షలు చేసేందుకు పరికరాలు లేవంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.
అయిదుగురు ఉంటేనే అంబులెన్స్..!
పాడేరు జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కనీసం మత్తు ఇచ్చే డాక్టర్ కూడా లేకపోవడం గమనార్హం. దీనివల్ల చిన్న చిన్న ఆపరేషన్లకూ వైజాగ్ కేజీహెచ్‌కు గర్భిణులను తరలిస్తున్నారు. ఏ మాత్రం పరీక్షలు చేయకుండానే విశాఖ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తీరా కేజీహెచ్‌కు వెళ్లాలంటే అంబులెన్స్ అందుబాటులో ఉండటం లేదు. ఒకేసారి అయిదుగురికిపైగా గర్భిణులు ఉంటేనే అంబులెన్స్ ఇస్తున్నారు. ఈలోగా గర్భిణులు నొప్పులు భరించలేక నరకం చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కాలయాపనతో వారి ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. సమస్యలను పరిష్కరించి, పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని గిరిజనులు కోరుతున్నారు.