విశాఖ నగరంలోని నడిబొడ్డున ఉన్న శ్రీ ప్రేమసమాజం స్వచ్ఛంద సంస్థ దశాబ్దాలుగా అనాథలను చేరదీయడం, వృద్థులకు ఆశ్రయం కల్పించడం, ఒంటరి మహిళలను ఆదుకోవడం, బాలికలను చదివించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వమే 1930లో ఏర్పాటైన ఈ సంస్ధ దాతల సాయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మారెడ్ల సత్యనారాయణ దీనిని స్ధాపించగా 1941లో దీనిని ట్రస్టుగా రిజిస్టర్ చేశారు. కంచర్ల రామబ్రహ్మం దీనికి 1941-46 మధ్య అధ్యక్షునిగా పని చేశారు. ఆయన మనవడు కంచర్ల రామబ్రహ్మం ప్రస్తుతం దీని అధ్యక్షునిగా ఉన్నారు. ఈ సంస్ధ సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన దాతలు విరాళాల రూపంలో స్ధిరాస్తులను సమకూర్చారు.
2007లోనే విచారణ
ప్రేమసమాజం కోసం ఇచ్చిన ఆస్తులలో రుషికొండలో చెరువు ప్రసాదరావు అనే దాత 1959లో 47.36 ఎకరాల భూమిని ఇచ్చారు. దీనిని 2004లో 33 ఎకరాలను 33 ఏళ్ల లీజుకు ఒక వ్యక్తికి కట్టబెట్టారు. దీనిపై 2007లో దేవాదాయ శాఖకు వచ్చిన ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ కమిషనర్ విచారణ చేపట్టి పలు లోపాలను ప్రభుత్వానికి నివేదించారు. తాజాగా శంకర్ అనే వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ప్రభుత్వం వెంటనే దీనిపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని మరో మారు నివేదిక కొరింది. ఈ లీజులో విధానాలు పాటించకపోవడమే కాకుండా మరికొన్ని ఉల్లంఘనలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ప్రేమసమాజానికి ఇచ్చిన పలు వెసులుబాట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
రూ.వందల కోట్ల విలువ చేసే స్థిరాస్తి:
డాబా గార్డెన్స్ లోని శ్రీ ప్రేమసమాజం ప్రధాన కార్యాలయ ప్రాంగణం ఎకరా 88 సెంట్లు ఉంది. ఇందులో వృద్థ శరణాలయం, గోశాల, అనాథ బాలల కేంద్రం నడుస్తున్నాయి. వృత్తి శిక్షణా కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆసుపత్రి కూడా ఇందులో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 67 మంది వృద్ధులు, 15 మంది బాలలు ఉన్నారు. ఇద్దరు మేనేజర్లు 17 మంది సిబ్బంది ఉన్నారు.