ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 12, 2023, 5:57 PM IST

ETV Bharat / state

Sunstroke To The Chicken: పౌల్ట్రీ రంగానికి వడదెబ్బ.. చనిపోతున్న కోళ్లు.. భారీగా నష్టం

Poultry Farms Loss: ఎండలు మండుతున్నాయి.. ఈ భగభగలు భరించలేక మనుషులే తట్టుకోలేక పోతున్నారు. అలాంటిది మూగజీవాలు ఎంతో అల్లాడిపోతున్నాయి. మండిపోతున్న ఎండలకు కోళ్లు బలైపోతున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గత మూడు రోజులుగా దంచుతున్న ఎండలతో పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు.. దానికి ఉక్కపోత తోడు కావడంతో రెండు జిల్లాల్లో లక్షకు పైగా లేయర్ కోళ్లు చనిపోయాయి. దీంతో రైతులకు కోట్లల్లో నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.

Chicken
Chicken

వడదెబ్బకు చనిపోయిన కోళ్లు.. నష్టపోయిన పౌల్ట్రీ రైతులు

Chicken deaths due to Heat: విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గత మూడు రోజులుగా వాతావరణం అగ్నిగుండంలా మారడంతో పౌల్ట్రీ రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అత్యధిక ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడు కావడంతో రెండు జిల్లాల్లో లక్షకు పైగా లేయర్ కోళ్లు చనిపోయాయి. రెండు జిల్లాల్లో పౌల్ట్రీ రైతులకు ఐదు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. వడగాల్పుల నుంచి కోళ్లను కాపాడుకోవడానికి రైతులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. వీటిని దహనం చేయడం రైతులకు మరింత భారంగా మారింది. ఒక్కొక్క కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో గుడ్లు పెట్టే కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లు చనిపోకుండా కాపాడేందుకు కోళ్ల ఫారాల చుట్టూ రైతులు గోనె సంచులు కట్టి తడుపుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలకు కోళ్లు తట్టుకోలేక మేత సరిగా తినడం లేదు, నీళ్లు తాగడం లేదని.. ఫలితంగా అవి వడదెబ్బకు గురై చనిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు వందలకు పైగా కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో 50 నుంచి 60 లక్షల వరకు గుడ్లు పెట్టే కోళ్లు పెంచుతున్నారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని తెలిసి కోళ్ల పెంపకం రైతులు కాస్త తగ్గించిన నష్టాలు తప్పలేదు. అనంతపురం, పద్మనాభం, సబ్బవరం, అనకాపల్లి, కసింకోట, పెందుర్తి, ఎలమంచిలి, మాడుగుల, మండలాల్లో ఎక్కువగా కోళ్లను పెంచుతున్నారు. మూడు రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో వీటిని బాయిలర్ లో వేసి తగలబెడుతున్నారు. కోళ్లకు చర్మ రంధ్రాలు ఉండకపోవడం వల్ల శరీరంలో వేడి నోటి ద్వారానే బయటికి పంపించాలి. అందుకే ఎక్కువ ఉష్ణోగ్రతను ఇవి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. గుడ్లు పెట్టే కోడి పిల్లను కొనడానికి రైతులు రూ. 45 పెడుతున్నామని. కోడిని గుడ్డు పెట్టే స్థాయికి పెంచడానికి ఒక్కొక్కదానికి 325 రూపాయలకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు.

ఒక కోడి 80 వారాల వరకు గుడ్లు పెడుతుందని.. మే నెల ప్రారంభం నుంచి కోళ్లు గుడ్లు పెట్టకపోవడంతో సగం ఉత్పత్తి తగ్గిపోయిందని తెలిపారు. చనిపోయిన కోళ్ళను కూలీలతో మోయించి ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నామని చెప్పారు. కోళ్లు తగలపెట్టే బాయిలర్లు ఉన్నచోటకు తరలించి అక్కడ కాల్చివేస్తున్నారు. ఇలా ఒక్కొక్క కోడిని దహనం చేయడానికి రైతు 30 రూపాయలు పైన ఖర్చు పెట్టాల్సి వస్తోందని..విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఒక పక్క కోళ్లు చనిపోయి నష్టపోగా.. మరోపక్క వీటిని దహనం చేయడానికి ఖర్చు చేయడం రైతులను మరింత నష్టాల్లోకి నెట్టుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడదెబ్బ నుంచి కోళ్లను కాపాడడానికి రైతులు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమవుతున్నాయని వివరించారు. ఈ ఎండలు ఇలాగే ఉంటే మొత్తం ఫారాలన్నీ ఖాళీ అయిపోతాయని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లక్షకు పైగా కోళ్లు చనిపోయాయని రైతులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details