విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో ఈ నెల 7న స్టైరీన్ ఆవిరి లీకైనప్పుడు మరికొన్ని విషవాయువులూ విడుదలయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. లీకేజీ అనంతరం ఆ ప్రాంతంలో ఏమేమి ఇతర వాయువులు ఉన్నాయో నమూనాలు సేకరించి పరిశోధిస్తున్నారు. సంస్థ పరిసరాల్లో స్టైరీన్‌తోపాటు పలు హైడ్రోకార్బన్ల జాడను గుర్తించారు. వాటన్నింటినీ కలిపి టి.వి.ఒ.సి.(టోటల్ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్)గా పేర్కొంటున్నారు. ఇందులో 80 శాతం వరకు అత్యధిక గాఢతతో స్టైరీన్ ఆవిరి, 20 శాతం ఇతర వాయువులు ఉన్నాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ట్యాంకులో ఉష్ణోగ్రత పెరిగిన కారణంగా స్టైరీన్ రసాయనిక చర్యకు గురై పాలిమరైజేషన్ చెందిందన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో విడుదలైన ఆవిరిలో బెంజీన్, ఇథలీన్ తదితర వాయువులున్నట్లు గుర్తించారు. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి, మరికొన్ని ప్రమాదరహితమైనవి. సమీప గ్రామాల్లోని ప్రజలు అస్వస్థతకు గురికావడానికి స్టైరీన్ ఆవిరితోపాటు ఇతర విషవాయువులూ కొంతవరకు కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నమూనాలను ప్రయోగశాలల్లో పరీక్షించాకే అవి ఏయే స్థాయుల్లో ఉన్నాయో స్పష్టత వస్తుంది.
రసాయన శాస్త్ర నిపుణులున్నారా?
రసాయనాల్ని భారీగా వినియోగించే సంస్థలు సాధారణంగా రసాయనశాస్త్ర నిపుణుల్ని నియమించుకుంటాయి. ప్రమాదాలకు గల అవకాశాలు.. ఒకవేళ అనుకోని ఘటనలు సంభవిస్తే తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు చెప్పగలుగుతారు. ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాద సమయంలో రసాయనశాస్త్ర నిపుణులు లేకపోవడం వల్లే పరిస్థితి తీవ్రతను అక్కడున్న సిబ్బంది అంచనా వేయలేకపోయినట్లు తెలుస్తోంది.
* ఎల్‌జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం విశాఖలోని 20 కర్మాగారాల్లో పరిస్థితులను నాలుగు బృందాలతో నిశితంగా అధ్యయనం చేయిస్తోంది.