ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రజా ఉద్యమమే శరణ్యమని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు స్పష్టం చేశారు. కార్మిక సంఘాలు ఒకే ఎజెండాను రూపొందించుకొని పోరాడితే అన్ని పార్టీలు కలిసి వస్తాయన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం స్టీల్‌ప్లాంటు ఆవరణలో ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. వైకాపా, తెదేపా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, జనసేన, మరికొన్ని పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని నేతలు పిలుపునిచ్చారు. సభకు పెద్దఎత్తున కార్మికులు, వారి కుటుంబీకులు తరలివచ్చారు. దక్షిణాది రాష్ట్రాలంటే దిల్లీలో లోకువ అని, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అంటే మరింత చులకనగా చూస్తారని సభలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వాపోయారు. ఉద్యమానికి వైకాపా సంపూర్ణ మద్దతునిస్తుందని, దిల్లీలోనూ పోరాడతామని తెలిపారు. అన్ని పార్టీలూ ప్రధానికి లేఖ రాయాలని సూచించారు. అసెంబ్లీలోనూ తీర్మానిస్తామన్నారు. ఉద్యమాన్ని తీవ్రం చేయాలని కార్మిక సంఘాలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సూచించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ భాజపాను నిలదీయాలన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా చొరవ చూపాలని విన్నవించారు.
‘దిల్లీ నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే రాష్ట్రం నుంచి వెళ్లిన భాజపా నేతలు వెనక్కిరండి. లేకపోతే అక్కడే ఉండండి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు. అన్ని పార్టీల నేతలతోనూ ముఖ్యమంత్రి మాట్లాడాలని, వారందరినీ ప్రధాని వద్దకు తీసుకెళ్లేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. న్యాయం జరగని పక్షంలో రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని, దిల్లీలోనూ పోరాడతామని అన్నారు. తెదేపా నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ తదితరులు మాట్లాడారు.
శైలజానాథ్, ఎంవీవీ వాగ్బాణాలు:
విశాఖలో పాదయాత్రలు చేస్తే లాభమేంటని వైకాపా నేతలనుద్దేశించి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. వారు దిల్లీలో నిలదీయాలన్నారు. పార్లమెంటులో గుసగుసలాడితే పని అవదని.. ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఈ సభల్లోకి రావడానికే భయపడేలా నిలదీయాలని సూచించారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఏం చేసిందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రశ్నించారు. పరస్పర వాగ్బాణాలతో సభలో గందరగోళమేర్పడింది.
కార్మికుల వద్దకు రాకపోవడం దుర్మార్గం
ఒక స్వామీజీకి మొక్కేందుకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చిన సీఎం జగన్.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులు, రైతుల వద్దకు రాకపోవడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి అంగీకరించి... ఒప్పందాలపై సంతకాలు చేశారని, అందుకే కార్మికులకు ముఖం చూపించలేకపోయారు.