విశాఖ మన్యంలో మారుమూల గ్రామాలను పోలీసులు సందర్శించి.. స్థానిక చిన్నారులకు చదువు చెబుతున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు.. సీలేరు ఎస్సై రంజిత్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు గ్రామాలను సందర్శిస్తున్నాయి. గత కొంత కాలంగా చదువుకు దూరమైన చిన్నారులతో కాసేపు గడిపి.. వారికి పాఠాలు బోధిస్తున్నారు. ఒక వైపు వర్షాలు పడుతున్నా... గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
ఇవాళ... గూడెం కొత్తవీధి మండలంలోని గుమ్మిరేవుల పంచాయతీ (తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు)లోని పలు గ్రామాలకు వెళ్లారు. ఆయా గ్రామాల్లోని చిన్నారులతో సరదాగా కాసేపు గడిపి పాఠాలు బోధించారు. కరోనా కారణంగా చిన్నారులు.. తమకు వచ్చిన చదువును సైతం మరిచిపోతున్నారని ఎస్సై రంజిత్ అన్నారు. అందుకే తమ వంతుగా సాయం చేస్తున్నామని.. గ్రామాల్లోని యువత ముందుకొచ్చి రోజుకో గంట పాటు చిన్నారులకు చదువు చెప్పాలని ఎస్సై సూచించారు.