ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదంతొక్కిన అంగన్‌వాడీలు ... విశాఖ కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా - anganwadis concern

Anganwadi chalo collectorate: విశాఖ జిల్లాలో తలపెట్టిన 'చలో కలెక్టరేట్' కార్యక్రమానికి తరలివెళ్తున్న అంగన్​వాడీ కార్యకర్తలను.. పోలీసులు అడ్డుకున్నారు. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, హుకుంపేట మండలాల నుంచి.. తెల్లవారుజామున 4 గంటలకు అంగన్వాడీ కార్యకర్తలు చాలామంది పాడేరు చేరుకున్నారు. అక్కడినుంచి ప్రైవేట్ వాహనాలల్లో విశాఖ బయల్దేరారు. అయితే చెక్ పోస్టుల వద్దే పోలీసులు తమని ఆపేసి.. వెనక్కి పంపిస్తున్నారని వారు ఆరోపించారు. తమ సమస్యల్ని పరిష్కరించేంత వరకు పోరాడతామని కార్యకర్తలు హెచ్చరించారు.

Anganwadi chalo collectorate
Anganwadi chalo collectorate

By

Published : Mar 8, 2022, 5:10 AM IST

Anganwadi chalo collectorate: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ విశాఖ జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విశాఖ నగరంలోని జగదాంబ కూడలి నుంచి కలెక్టరేట్‌ దాకా ర్యాలీగా వచ్చిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా మహిళా పోలీసులను భారీగా మోహరించి రోడ్డుకు అడ్డుగా తాళ్లు కట్టి, స్టాపర్లు పెట్టి నిలువరించారు. ఈ క్రమంలో అంగన్‌వాడీలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించడం, అసభ్య పదజాలంతో దూషించడంతో అంగన్‌వాడీ కార్యకర్తలంతా భగ్గుమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా మహిళలను ఇలా నిర్భందించడాన్ని ఆ సంఘ నేతలు తప్పుబట్టారు. గత ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని, మా ప్రభుత్వం వచ్చాక చక్కగా చూసుకుంటానని చెప్పి... ఈ రోజు అధికారంలో ఉండి చేసిందేంటని సీఎం జగన్‌ను ప్రశ్నించారు.

తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానన్న హామీ ఏమైందన్నారు. రూ.7 వేలు జీతం తీసుకుంటున్న అంగన్‌వాడీ సిబ్బందికి సంక్షేమ పథకాలను నిలిపేయడం దారుణమన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. ‘తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అంగన్‌వాడీ టీచర్లకు రూ.7 వేల నుంచి రూ.11,500, ఆయాలకు రూ.4,500 నుంచి రూ.7 వేలు పెంచినట్లు సీఎం అబద్ధాలాడుతున్నారు. అయ్యా మీకు జీవోలు తెలియకపోతే ఒకసారి చూసుకోండి. జీవో నంబరు 18 ద్వారా 2018 జులైలో అంగన్‌వాడీలకు రూ.7 వేల నుంచి రూ.10,500, ఆయాలకు రూ.4,500 నుంచి రూ.7 వేలకు వేతనాలు పెంచారు. 2018లో అధికారంలో ఉంది ఎవరు జగన్‌ గారూ’ అని అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి ఆస్తులడిగామా, బంగ్లాలు అడిగామా.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ రేట్లు ఇవ్వమంటున్నాం. కనీస వేతనంగా రూ.26 వేలు ఇచ్చి... రిటైర్మెంట్‌ ప్రయోజనాలు కల్పించాలి. వేతనంలో సంగం పింఛనుగా ఇవ్వాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లిన అంగన్వాడీ కార్యకర్త

ఇదీ చదవండి:NSTL women scientists: ఎన్​ఎస్​టీఎల్​ మహిళా శాస్త్రవేతలతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details