విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం ఏ.కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం వీఆర్పీ సింహాచలం నాయుడిపై ఎస్ఐ చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ గ్రామస్థులు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే వీఆర్పీ సింహాచలం నాయుడు భూమి సరిహద్దు తగాదా సమస్య గురించి ఆదివారం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎస్ఐ సతీష్ తనపై చేయి చేసుకున్నాడని చెప్పారు. దీనిపై సీఐ ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం వీఆర్పీకి మద్దతుగా గ్రామస్థులు, వైకాపా శ్రేణులు స్టేషన్ ముందు బైఠాయించారు. ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఐ ఈశ్వరరావు స్పందిస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పటంతో పరిస్థితి చక్కబడింది.