విశాఖ నగరంలో లక్షలాదిగా ఉన్న వాహనదారుల్లో ఎందరో పెద్దఎత్తున ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇష్టారాజ్యంగా వాహనాన్ని నడుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని, రేసింగ్‌లకు పాల్పడేవారిని, మైనర్ డ్రైవర్లను, వారి తల్లిదండ్రులను పోలీసు కమిషనరేట్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నా.. అపరాధరుసుం వసూలు చేస్తున్నా.. కొందరిని జైళ్లకు పంపుతున్నా.. అత్యధికుల్లో మార్పు రావడంలేదు. ఇకపై కొన్నాళ్లపాటు తీవ్రమైన వాహన ఉల్లంఘనలను పాల్పడేవారిపై నేరుగా ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు నిర్ణయించారు. ఇలాంటి కేసుల్లో తీర్పులు కూడా చాలా వేగంగానే వచ్చే అవకాశం ఉంది.
వాహనాలు కూడా పోలీసుల ఆధీనంలోనే..
ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేస్తే వాహనదారుల వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. కొన్ని రోజులపాటు అది పోలీసుస్టేషన్లోనే ఉంటుంది. కేసు పురోగతిని బట్టి విడుదల చేసే అంశంపై పోలీసులు నిర్ణయం తీసుకుంటారు. కొన్నిరోజులపాటు వాహనం అందుబాటులో లేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనైనా పలువురు వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులకు భారమే అయినా....
ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై విధించే అపరాధరుసుంలు ఎక్కువగానే ఉంటున్నాయి. చాలా మంది వాహనదారులు ఆయా రుసుంలు చెల్లించేసి ...మళ్లీ అదే పంథా అనుసరిస్తున్నారు. అపరాధరుసుంకు వెరవకుండా తమకు నచ్చినట్లు అంతులేని వేగంతో, అత్యంత ప్రమాదకరంగా వాహనాలను నడుపుతున్నారు. ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేస్తే పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయాలి. కొన్ని సాక్ష్యాల్ని కూడా సేకరించాలి. అందుకోసం విస్తృత కసరత్తుతోపాటు ప్రతి కేసుకూ పోలీసులు చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేసే విధానంతో పోలీసులపై పని ఒత్తిడి గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వాహనదారుల్లో మార్పు తీసుకురావడానికి అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నారు.
ఇప్పటికే 250 మందిపై కేసులు..